పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరే ఒక సంచలనం. సినిమాల పరంగా టాప్ స్థాయిలో దూసుకుపోతోన్న సమయంలోనే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత సినిమాలు చేయనని చెప్పారు. కానీ గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. తిరిగి మళ్లీ సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యారు. ఎందుకు సినిమాలు చేయాల్సి వచ్చిందో కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అయితే పాలిటిక్స్‌లోకి వెళ్లక ముందు కూడా పవన్ సినిమాల విషయంలో చాలా స్లోగానే ఉండేవారు. కానీ రీ ఎంట్రీలో మాత్రం దుమ్మురేపుతున్నారు. వరుస సినిమాలు అంగీకరించడమే కాకుండా.. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. మంగళవారం ఆయన మార్నింగ్ ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ వెంటనే అంటే మథ్యాహ్నం నుంచి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూట్‌లో పాల్గొన్నారు.

మరి సినిమాలేనా.. రాజకీయాలు పక్కన పెట్టేసినట్లేనా? అంటే పప్పులో కాలేసినట్లే. షాట్ గ్యాప్‌లో ఏపీ మున్సిపల్ ఎన్నికల గురించి కూడా ఆరా తీస్తూ.. పార్టీ కార్యకర్తలతో టచ్‌లోనే ఉంటున్నారట. ఇలా పవన్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే.. ఇక పార్టీ మూసేసినట్లే అని కామెంట్స్ చేసిన వారు కూడా ఆశ్చర్యపోయేలా.. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో పవన్ బ్యాలెన్స్ చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. రెండు సినిమాలు ఏకకాలంలో ఇంతకు ముందెన్నడు పవన్ చేయలేదు. ఇప్పుడు మాత్రం పరుగులు పెట్టిస్తున్నాడంటూ.. ఆయన అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నుంచి.. సెకండ్ సింగిల్ బుధవారం సాయంత్రం విడుదల కాబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. అటు పాలిటిక్స్ పరంగానూ, ఇటు సినిమాల పరంగానూ పవన్ కల్యాణ్ దుమ్మురేపుతున్నాడని చెప్పుకోవచ్చు.