ఆదిపురుష్ చిత్రం ప్రకటన వెలువడిన నాటినుంచి ప్రతీసారీ వార్తల్లోనే ఉంటూ వస్తోంది. అందుకు ప్రధానమైన కారణం బాహుబలి ది గ్రేట్, ప్రభాస్ అందులో రాముడు పాత్రను ధరించడమే. రెండోది సైఫ్ ఆలీఖాన్ రావణుడి పాత్రకు అంగీకరించడం. దీనిని మించి ఎప్పుడైతే ఆదిపురుష్ సెట్లో అగ్నిప్రమాదం జరిగిందో మొత్తం మీడియా అంతా హోరెత్తిపోయింది. భారీ వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన సెట్ అగ్నికి ఆహుతి కావడం అందర్నీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. అసలు అర్థం కాని విషయం ఏమిటంటే, అంత విలువైన సెట్టే కానక్కర్లేదు, సాధారణమైన సెట్స్‌లో కూడా అగ్నిప్రమాదాలను గానీ, షార్ట్‌సర్క్యూట్ వల్ల వచ్చే ప్రమాదాలను గానీ ముందుగానే ఊహించి దానికి తగిన చర్యలను తీసుకోవడం అతి సాధారణమైన విషయం. మరి అలాంటిది ఎందుకు ఆ విషయాన్ని నిర్మాతలు నిర్లక్ష్యం చేశారు. మానవతప్పిదానికి అంతూపొంతూ ఉండదన్న వేదాంతాలు కొన్ని సందర్భాలకు వర్తించనే వర్తించదు. ఆదిపురుష్ కూడా అంతే.

అయితే మొదట దీనిని అందరూ అగ్ని ప్రమాదంగానే పరిగణించారు. కానీ అనుమానాలు మాత్రం అంతరించిపోలేదు. ఓ టీమ్ దానిపైన నిఘా పెట్టి, అసలుసిసలు కారణాలను అన్వేషిస్తూనే ఉంది. ఆ అన్వేషణలో.. తీగలాగితే డొంకంతా కదిలినట్టయింది. సైఫ్ ఆలీఖాన్ రావణ పాత్రను గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కొందరికి నచ్చలేదు. సైఫ్ భావాలనో, మాటలలోని అర్థాలనో కొందరు మౌనంగానే వ్యతిరేకించారు. కొందరు బైట పడ్డారు. సోషల్ మీడియాలో రేగిన దుమారాన్ని చూసి, సైఫ్ కూడా కొంచెం ఖంగుతిన్నాడు. తన తప్పు తెలుసుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. కానీ వ్యతిరేకులలో ఆగ్రహజ్వాలలు ఆరిపోలేదని, అందుకు ఈ అగ్నిప్రమాదమే నిదర్శనమని బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త వ్యాఖ్యానాలు మొదలవుతున్నాయి.
యూనిట్ సభ్యులైతే ఇదేదో సహజంగానే జరిగిన సంఘటన అంటే ససేమిరా అంగీకరించడం లేదు. అదెలా కుదురుతుంది.. సైంటిఫిక్‌గా ఎన్నో జాగ్రత్తలు పాటించిన సెట్లో మొదటి రోజే ఇటువంటి ప్రమాదం జరగడాన్ని ఉదాసీనంగా తీసుకోకూడదని ఆదిపురుష్ యూనిట్ చెబుతోంది. కోట్లరూపాయల నష్టం వచ్చింది. నిర్మాతలకి అప్రదిష్ట. దర్శకుడు, నటీనటులకి అవమానం. పైగా ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే ఆదిపురుష్ అతిపెద్ద ప్రాజెక్టు. అటువంటి సెట్లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఏదో ఒక అదృశ్యహస్తం దాగి ఉందన్న విషయం బాలీవుడ్‌లో ఇప్పడు చాలా గట్టిగా వినిపిస్తోందని బాలీవుడ్ మీడియా బాహాటంగా విశ్లేషిస్తోంది. అయినా అధికారికంగా నిజానిజాలు తెలిసే వరకూ కూడా ఏదీ నిర్ధారించలేమని కూడా బాలీవుడ్ మీడియానే వల్లెవేస్తోంది.