వైజాగ్ నుంచి సంజు(సందీప్‌కిషన్) యానాంలోని తన మావయ్య ఇంటికి వస్తాడు. అక్కడ లావణ్య(లావణ్య త్రిపాఠి)ని చూసి ఇష్టపడతాడు. ఆమెకు సాయం చేస్తూ ఆమె మనస్సును గెలుచుకుంటాడు. హాకీ ప్లేయర్ అయిన లావణ్యకు ఓ సందర్భంలో హాకీ ఆటపరంగా సాయం చేయడంతో సంజు అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇండియన్ అండర్ 21 టీమ్‌కు వైజాగ్ తరపున ఎన్నిక అవడమే కాదు.. ఇండియన్ హాకీ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించి అంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్న సందీప్ నాయుడే సంజు అనే నిజం అందరికీ తెలుస్తుంది. అదే సమయంలో యానాంకు చెందిన రాజకీయ నాయకుడు, క్రీడా శాఖా మంత్రి రావు రమేశ్(రావు రమేశ్) యానాంలోని చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌లో ఓ మెడికల్ ఫ్యాక్టరీ పెట్టడానికి సదరు కంపెనీ అధినేతలతో లోపాయికారీ ఒప్పందాన్ని చేసుకుంటాడు.

అందులో భాగంగా ‘యానాం చిట్టిబాబు హాకీ టీమ్’ను అండర్ ఫెర్ఫామెన్స్ చేస్తుందని చెప్పి పొలిటికల్ గేమ్ ఆడటం మొదలుపెడతాడు. అలా చేస్తే గ్రౌండ్‌ను మెడికల్ ఫ్యాక్టరీ వాళ్లకి లీజుకి ఇచ్చేయవచ్చునని రావు రమేష్ ప్లాన్. అయితే అక్కడ పనిచేసే హాకీ కోచ్(మురళీశర్మ) తన టీమ్ అండర్ ఫెర్ఫామెన్స్ టీమ్ కాదని నిరూపించుకోవాలనుకుంటాడు. అందుకోసం నేషనల్ రేంజ్‌లో జరిగే ధ్యాన్ చంద్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనాలని అనుకుంటాడు. అయితే అలా పాల్గొనడానికి టీమ్‌లో ఓ నేషనల్ ప్లేయర్ అయినా ఉండాలి. అందుకోసం సందీప్ నాయుడు అలియాస్ సంజుని తన చిట్టిబాబు టీమ్ తరపున టోర్నమెంట్‌లో ఆడమని రిక్వెసట్ చేస్తాడు మురళీ. అందుకు సందీప్ ఒప్పుకోడు. అసలు ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ నాయుడు ఎందుకు యానాం వస్తాడు? అతని వెనకున్న బాధాకరమైన ఘటనేంటి? చివరకు చిట్టిబాబు క్లబ్ తరపున సందీప్ ఆడాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
భారతదేశ క్రీడల్లో మంచి ఆటగాళ్లు రాకపోవడం వెనుక ఉన్న ఈగోలు, రాజకీయాలను బేస్ చేసుకుని తెరకెక్కిన తమిళ చిత్రమే నప్పే తునై. యానాం అనే ప్రాంతానికి చెందిన హాకీ గ్రౌండ్ కోసం అక్కడి ఆటగాళ్లు ఎలా పోరాడాడు? అనేదే కథ. స్టోరీ వింటుంటే మన తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమా గుర్తుకు వస్తుంది కదా. అందులో కూడా నితిన్ అతని స్నేహితులు వారి కాలేజ్ గ్రౌండ్ కోసం రగ్బీ ఆడుతారు. ఏ1 ఎక్స్‌ప్రెస్ విషయానికి వస్తే కాస్త పొలిటికల్ యాంగిల్‌ను జోడించి హాకీ ఆట నేపథ్యంలో సినిమాను రూపొందించారు. నటీనటుల విషయానికి వస్తే.. హీరో సందీప్ కిషన్, సినిమాలో కథానాయకుడిగానే కాదు.. నిర్మాతగా తన పాత్రను పోషించాడు. అంతే కాదండోయ్ ఈ సినిమా కోసం చాలా కష్టప్డడాడని సినిమా చూసేవారికి అర్థమవుతుంది. సినిమాలో సందీప్ పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఓ వేరియేషన్ కోసం 21 ఏళ్ల కుర్రాడిగా కనిపించడానికి బాగా సన్నబడ్డాడు. స్పోర్ట్స్‌మెన్ ఎలా ఉంటారనేలా లుక్ మార్చి పాత్ర కోసం పిక్స్ ప్యాక్ కూడా పెంచడం విశేషం. ఇక లావణ్య ఈ సినిమాలో లేడీ హాకీ ప్లేయర్‌గా తన వంతు పాత్రను పోషించింది. పాటల్లో ఆడిపాడింది. ఇక లిప్‌లాక్ కూడా ఇచ్చేసింది మరి. హాకీ గ్రౌండ్‌ను అమ్మకానికి పెట్టేసిన పొలిటీషియన్ పాత్రలో రావు రమేష్ సింప్లీ సూపర్బ్‌గా ఇరగదీశాడు మరి. ఇక సెకండాఫ్‌లో కీలకమైన పాత్రల్లో.. సందీప్ కిషన్ స్నేహితులుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించారు. హీరో అజ్ఞాతానికి కారణమైన ఫ్లాష్ బ్యాక్.. దానికి ఫ్రెండ్‌షిప్, హాకీ ఆట, రాజకీయాలను మిక్స్ చేసి చూపించారు. సాధారణంగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అంటే కామెడీ పాత్రలే గుర్తుకు వస్తాయి. అప్పుడప్పుడే వీరు సీరియస్ పాత్రల్లో నటించారు. మరోసారి వీళ్లిద్దరూ ఎమోషనల్ టచ్ పాత్రల్లో నటించారు. కథకు ఎంతో కీలకమైన పాత్రలుగా వీరి పాత్రలను దర్శకుడు ఎలివేట్ చేశాడు. ఇక మురళీశర్మ, రఘుబాబు, సత్య, మహేశ్ విట్టా, భూపాల్, ఖయ్యుమ్ తదితరులు వారి వారి పాత్రలను చక్కగా పోషించారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే .. దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను సినిమాను తెలుగు నెటివిటీకి చక్కగానే మలిచాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని స్నేహితుల మధ్య ట్రాక్, హాకీ గేమ్‌ను తెరకెక్కించిన తీరు అన్నీ చక్కగా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా.. ఇంటర్వెల్ ముందు వరకు రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మేట్‌లోనే సినిమా ఉంటుంది. తమిళ చిత్రం ‘నప్పే తునై’ సినిమాను అలాగే తీసుకున్నప్పటికీ తమిళంలో కంటే తెలుగులో హీరో ఎలివేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు.
హీరోయిన్ తండ్రి పాత్రకు తమిళంలో ఉండే ఇంపార్టెన్స్ తెలుగులో కనపించదు. ఇలాంటి విషయాల్లో దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను తగు జాగ్రత్తలే తీసుకున్నాడు. అయితే ఫస్టాఫ్ రొటీన్ కమర్షియల్ మూవీ ఫార్మేట్‌లో వెళ్లిపోయిన సినిమాలా అనిపిస్తుంది. అది ప్రేక్షకుడికి బోరింగ్‌గా అనిపిస్తుంది. హిప్ హాప్ తమిళ సంగీతం, నేపథ్య సంగీతాన్ని చాలా సందర్భాల్లో తమిళంలో ఉన్నట్లే తీసుకున్నారు. ఇక పాటలను తమిళ స్టైల్లోనే తెరకెక్కించేశారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో హాకీ ఆటను తెరకెక్కించిన తీరు, విజువల్స్ చక్కగా ఉన్నాయి.
రాజకీయాల వల్ల క్రీడలకు జరుగుతున్న అన్యాయం, అక్కడి సమస్యలను రావు రమేష్ పాత్రను పెట్టి.. చక్కగా ఎలివేట్ చేశారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులకు సంబంధించి సెటైరికల్ డైలాగ్స్ వినిపిస్తాయి. అలాగే ‘‘పోరాటం చేయడం ముఖ్యం కాదు. ఎలా చేస్తున్నామనేదే ముఖ్యం, మంచి చెప్పడం సులభమే కానీ పాటించడమే కష్టం, వెధవలు ఒకసారి గెలిస్తే చాలు, కానీ మంచివాళ్లు ప్రతిసారి గెలవాల్సిన పరిస్థితి ఉంది’’ ఇలాంటి డైలాగ్స్ సందర్భానుసారం బాగానే అనిపించాయి.