హృతిక్ రోషన్‌కి, కంగనా రనౌత్‌కి మధ్య జరిగిన ఇమెయిల్ భాగోతం రావణకాష్టంలా అలా ఇంకా ఇంకా రగులుతూనే ఉంది. ఎప్పుడో 2016లో సూపర్‌స్టార్స్ ఇద్దరికీ మధ్యన పడిన ముడి పీటముడిగా మారి, చివరికి గట్టిగా బిగుసుకుపోయింది. ఏదైనా బోల్డ్‌గా మాట్లాడే అలవాటున్న కంగనా తనకి నచ్చింది నచ్చినట్టుగా ఏదో టీవీ ఇంటర్యూలో మాట్లాడేసింది. తనకీ, హృతిక్‌కి మధ్యలో రిలేషన్ ఉన్నట్టు, తర్వాత అది బ్రేక్ అయినట్టు ఇష్టానికి చెప్పేసింది. హృతిక్ రోషన్‌తో సంబంధం ఉందని చెబితే గ్లామర్ పెరుగుతుందనుకుందో ఏమో మరి….టీవీ షోలో ఊకదంపుడు దంచేసింది. దాంతో హృతిక్ కొంచెం హర్ట్ అయి, కొందరి సలహా మేరకు కంగనా మాటలని సీరియస్‌గా తీసుకుని వెంటనే కంగనా మీద కేసు ఫైల్ చేశాడు.

నిజానికి బాలీవుడ్‌లో ఇటువంటి తమాషా బిల్డప్‌లు చాలా నేచురల్. అందుకే హృతిక్ తన మాటలని అంత సీరియస్‌గా తీసుకుంటాడని ఈ ఫైర్‌బ్రాండ్ ఊహించలేదు. డామిట్ కథ అడ్డంగా తిరిగింది. అన్నట్టుగా హృతిక్ కేసు ఫైల్ చేయగానే ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఇరుక్కున్న కంగనా ఉలుకూ పలుకూ లేకుండా ఊరుకుంది. కంగనా ఊరుకున్నా.. హృతిక్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఉడుం పట్టు పట్టాడు. దాంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ కూడా ఆ కేసు అలా లైవ్‌లోనే ఉంది. హృతిక్ ఉంచాడని చెప్పాలి. సిల్లీ ఎక్స్ అని తనకి కంగనా ఓ కొత్త పేరు పెట్టినందుకు పని గట్టుకుని మరీ ఎదురు తిరిగాడు. వాళ్ళిద్దరి మధ్యన ఇమెయిల్స్ కూడా నడిచాయని తన ప్రేమాయణాన్ని భూతద్దంలో మీడియాకి చూపించడానికి ప్రయాస పడిన కంగనా.. హృతిక్ ధోరణికి ఖంగుతింది.
2014లో జరిగిందని కంగనా చెప్పిన ఆమె ప్రేమ ఉదంతం 2016లో కోర్టుకెక్కింది. అప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో, ధారావాహిక టీవీ ప్రోగ్రాంలా ఆ కేసు ఆగిఆగి సాగుతూనే ఉంది. అయితే ఇప్పడు మళ్ళీ కేసు వ్యవహారం తెర మీదకి వచ్చింది. బేసిక్‌గా హృతిక్ రోషన్ కోరిక మేరకు కేసు ముంబై పోలీసుల చేతిలో నుంచి క్రైం ఇంటలిజెన్స్ యూనిట్ ఆఫ్ ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్‌కి షిఫ్ట్ అయింది. క్రైం బ్రాంచ్ కొత్తగా ఈ రోజు(శుక్రవారం) హృతిక్‌ని కోర్టుకి హాజరు కావాల్సిందిగా సమన్ చేశారు. రేపు అంటే ఫిబ్రవరి 27న హృతిక్ తను ఫైల్ చేసిన కేసుకు హాజరు కావాల్సిందిగా క్రైం ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ కబురుపెట్టింది. రేపు క్రైం బ్రాంచ్ ముందు హాజరు కానున్న హృతిక్ స్టేట్మెంట్‌ని రికార్డ్ చేయబోతోంది డిపార్ట్‌మెంట్.
గతంలో కంగనా ఏకరువు పెట్టిన విషయాలన్నిటినీ పూర్తిగా కొట్టిపారేశాడు హృతిక్. అసలు ఆ మెయిల్స్‌తో తనకెటువంటి ప్రమేయం లేదని, ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన పేరు మీద కంగనాకి మెయిల్స్ పంపించారని హృతిక్ చెప్పగా, హృతిక్ వ్యక్తిగత న్యాయవాది ఆ విషయాన్నే గట్టిగా వాదించాడు. దీనిని బలపరుస్తూ హృతిక్ కూడా మీడియాకి కూడా చురకలంటిస్తూ ట్వీట్ చేయడంతో మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసుకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. మరి రేపు(శనివారం) హృతిక్ ఏ రకం వాంగ్మూలం ఇవ్వబోతున్నాడనేదే ప్రస్తుతం అందరి ఆలోచన. టీ కప్పులో తుఫాను అంటే ఇదే.