హాలీవుడ్ లవ్ బర్డ్స్ బెన్ అఫ్లెక్- అన డె అర్మాస్ ఈ మధ్యే ప్రేమ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే.

ఇది జరిగిన రెండు వారాలకు అన డె సోషల్ మీడియాకే గుడ్‌బై చెప్తూ ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయంతో అన డె అభిమానులు విచారంలో మునిగిపోయారు. కాగా “డీప్ వాటర్” సినిమా షూటింగ్ సమయంలో బెన్, అన డె ప్రేమలో పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లోనే ప్రేమ విషయాన్ని అన డె అధికారికంగా ధృవీకరించింది. అతడితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. తన క్వారంటైన్ సమయాన్ని కూడా లాస్ ఏంజెల్స్‌లోని బెన్ నివాసంలో అతడి పిల్లలతో గడిపింది. కానీ ఏడాది తిరిగేలోగా ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు.బెన్ ఇప్పుడు అనతో డేటింగ్ చేయట్లేదని, వారి మధ్య బంధం బీటలు వారిందని వారి సన్నిహితులు మీడియాకు తెలిపారు. బెన్ తన పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్‌లోనే ఉండాలనుకుంటున్నాడని, కానీ అన డె లాస్ ఏంజెల్స్‌కు రావాలనుకోవట్లేదని మీడియాకు తెలిపారు. విడిపోయినప్పటికీ వారు సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఆ మధ్య బెన్ అఫ్లెక్ ఇంట్లో నుంచి అన డె ఫొటోలను సిబ్బంది చెత్త డబ్బాలో పారేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సదరు నటి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.