మెగా హీరో ఎంట్రీ అదిరింది.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే టాక్ వినబడుతోంది. కలెక్షన్స్ కూడా అదే చెబుతున్నాయి. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సాయితేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై విజయఢంకా మోగిస్తుంది.

కలెక్షన్లపరంగా కూడా ఏ మెగా హీరో పరిచయ చిత్రానికి సాధించని కలెక్షన్లు వైష్ణవ్ ఈ చిత్రంతో సాధించినట్లుగా చెబుతున్నారు.. కానీ అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు కదా. ఈ సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే.. ఓటీటీ వాళ్ల నుంచి బంపర్ ఆఫర్ వచ్చినా.. మైత్రీ వారు వెనకడుగు వేయలేదు. వారి నమ్మకం నిజమై.. ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఇక ఈ చిత్రానికి మెగా హీరోలందరి ఆశీస్సులు లభించాయి. మెగాస్టార్, పవర్ స్టార్, మెగాపవర్ స్టార్.. ఇలా మెగా హీరోలందరూ ‘ఉప్పెన’ సినిమా గురించి ప్రత్యేకంగా ట్వీట్స్, మెసేజేస్ పంపించారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు ఈ సినిమాపై స్పందించలేదంటూ కొందరు సెటైరికల్‌గా వార్తలు మొదలెట్టారు. బన్నీ ట్రెండ్ తెలిసి కూడా వారు ఇటువంటి వార్తలు పుట్టిస్తున్నారంటే.. బహుశా వారు బన్నీ ట్రెండ్‌ని మరిచిపోయి ఉంటారు.
ఇంతకీ బన్నీ ట్రెండ్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు కదా..!. ఏదైనా సినిమా విడుదలై.. మంచి విజయం సాధిస్తే.. ఆ సినిమా గురించి బన్నీ ఎక్కడా ట్వీట్స్, మెసేజ్‌లు చేయరు. డైరెక్ట్‌గా ఆ చిత్రయూనిట్ మొత్తాన్ని పిలిచి వారికి పార్టీ ఇచ్చి ప్రత్యేకంగా సన్మానిస్తారు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లిరండి.. బన్నీ ఎలా ట్రెండ్ సెట్ చేశారో అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ‘ఉప్పెన’ టీమ్‌ని.. వీలు చూసుకుని సన్మానించే కార్యక్రమం ఏదో బన్నీ ప్లాన్ చేసే ఉంటారు. ఆయన మౌనాన్ని.. ఏదేదో ఊహించుకుంటూ వార్తలు వడ్డించేవారికి త్వరలోనే ఆయన ఇటువంటి న్యూస్‌తో షాకివ్వడం ఖాయం.