సేవ్ థియేటర్స్.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి నినాదాలు

0
363
Spread the love

కరోనా కల్లోలం చెలరేగిన తర్వాత లాక్‌డౌన్‌ ప్రారంభం కాగానే మొట్టమొదట క్లోజ్ అయింది సినిమా పరిశ్రమే. షూటింగ్స్‌ అన్నీ ఆగిపోయాయి. రిలీజులు నిలిచిపోయాయి. పర్యవసానంగా, సినిమా థియేటర్లు మూతబడ్డాయి. అసలే టీవీలు, ఓటిటిలు మధ్యలో పడి నలిగిపోతున్న థియేటర్ రంగాన్ని లాక్‌డౌన్‌ చావు దెబ్బకొట్టింది. మూలిగే నక్కమీద తాటిపండు పడిందన్నట్టుగా, థియేటర్ల యాజమాన్యాలు దెబ్బకి చతికిలబడిపోయారు. వీటన్నిటినీ అలా ఉంచితే, 1960 నుంచి అమలులో ఉన్న పార్కింగ్ ఫీజుల్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి థియేటర్లకు ఊపిరాడకుండా చేసిందని థియేటర్ ఓనర్స్ ఏనాటి నుంచో బోరుమంటున్నారు. అయితే థియేటర్లవారు అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించుకున్నాక, అనేక పర్యాయాలు వ్యక్తిగతంగా మొరపెట్టుకున్నాక ఊరికే కంటితుడుపు హామీలు తప్పితే ఏ హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చని నేపథ్యంలో.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా తెలంగాణ థియేటర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంది.

ఏనాటి నుంచో అమలులో ఉన్న పార్కింగ్ ఫీజును తొలిగించి థియేటర్లను చాలా ఇబ్బందులకు గురిచేశారని, పూర్వం అంత కాకపోయినా ఎంతో కొంత నామమాత్రంగానైనా పార్కింగ్ ఫీజును వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని అసోసియేషన్ ముక్తకంఠంతో కోరుకుంది. లాక్‌డౌన్‌ అనంతరం ముందుగా మూసివేసింది థియేటర్లనే.. అలాగే చిట్టచివరన తెరుచుకున్నవి కూడా థియేటర్లు మాత్రమేనని, లాక్‌డౌన్‌ కాలంలో కూడా తాము స్టాఫ్‌కి ఏ నెలా జీతాలు ఎగవేయకుండా ఇచ్చామని, పిఎఫ్‌లు కూడా కొనసాగించామని, అంత క్రమశిక్షణతో థియేటర్లను నడుపుతున్న తమకి ప్రభుత్వం నుంచి సవతి తల్లి ప్రేమే ఎదురవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లు మూసివేసిన దశలో కూడా పవర్‌ బిల్స్‌ చెల్లించామని, ఆ డబ్బును వచ్చే నెలల్లో కవర్ చేస్తామన్న ప్రభుత్వ హామీ కూడా ప్రస్తుతానికి బుట్టదాఖలుగానే మిగిలిందని పేర్కొన్నారు. టికెట్ రేట్స్‌ని అనుకూలంగా మార్చుకునే వసతిని, నెంబరాఫ్ షోస్‌ని పెంచుకునే సౌకర్యాన్ని కూడా పరిశీలించమని వారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుని కోరారు. అలాగే లాక్‌డౌన్‌ కాలంలో థియేటర్ల నుంచి వసూలు చేసే ఆస్తిపన్ను మినహాయింపు కూడా వారి జాబితాలో ప్రధానమైంది. అసలే సతమతమవుతున్న థియేటర్ల మనుగడను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి భుజాలపైనే ఉందని వారీ సందర్భంగా తెలియజేశారు.

భారతదేశంలో పార్కింగ్ ఫీజును రద్దు చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణాయేనని, ముఖ్యమంత్రి తమకు గతంలో ఇచ్చిన మాట మేరకు మానవతాదృష్టితో థియేటర్లను సమస్యల సుడిగుండం నుంచి రక్షించమని, సంరక్షించమని థియేటర్ల యాజమానులు పదేపదే ఆవేదనతో అభ్యర్థించారు. తాము తెలంగాణ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, కేవలం తమ సమస్యలను పరిష్కరిస్తే తామంతా ముఖ్యమంత్రికి ఋణపడిఉంటామని చెప్పుకున్నారు. లేకుంటే ఇప్పటికే ఎన్నో థియేటర్లు మూతపడిపోయాయని, మూసివేయడానికి మరికొన్ని థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని థియేటర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డా. నరేష్‌ గౌడ్‌, సునీల్ నారంగ్, అక్షితా రెడ్డి, బాలగోవిందరాజు, విజయేందర్ రెడ్డి, మురళీమోహనరావు, సదానంద్‌ గౌడ్‌, రవికుమార్, విజయకుమార్.. వంటి వారంతా థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పూసగుచ్చినట్టు వివరించారు. సమావేశమైన యజమానులందరూ సేవ్ థియేటర్స్ అని ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here