‘స్వప్నా సినిమా’నా..! అయితే సంచలనమే!

0
409
Spread the love

సంచలన నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన స్వప్నా దత్‌, ప్రియాంక దత్‌ అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ‘స్వప్నా సినిమా’ అనే బ్యానర్‌ స్థాపించి.. వారు నిర్మించే ప్రతి చిత్రాన్ని ఓ ఆణిముత్యంలా తీర్చిదిద్దుతున్నారు. తీసింది మూడే చిత్రాలు.. అందులో రెండు విడుదయ్యాయి. మూడోది మార్చి 11న విడుదల కాబోతోంది. ఎడాపెడా సినిమాలు చేయకుండా.. ‘స్వప్నా సినిమా’లో మంచి కంటెంట్‌ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతాయి అనేలా ప్రేక్షకులలో సైతం ఈ బ్యానర్‌ పేరును గడించింది. రెండే రెండు చిత్రాలతో టాక్‌ ఆప్‌ ద ఇండస్ట్రీకి అవడానికి కారణం వారు కంటెంట్‌ విషయంలో తీసుకున్న జాగ్రత్తలే. సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్టులపై పట్టున్న వీరు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో అయితే ఓ చరిత్రనే తిరగరాశారు. ఈ బ్యానర్‌లో వచ్చిన చిత్రాలు గురించి చెప్పుకుంటే..

  1. ఎవడే సుబ్రమణ్యం

స్వప్నా సినిమా బ్యానర్‌ మొదటి చిత్రంతో ఓ సంచలన దర్శకుడిని టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఇచ్చింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి వైవిధ్యభరిత చిత్రంతో.. పరిచయం అవ్వడమే కాకుండా.. ఇద్దరు నటులను స్టార్స్‌ని చేశారు. ఆ స్టార్స్‌ మరెవరో కాదు.. ఇప్పుడు న్యాచురల్‌ స్టార్‌గా చెప్పుకుంటున్న నాని, రౌడీ స్టార్‌గా చెప్పుకుంటున్న విజయ్‌ దేవరకొండ. వారిద్దరిలో దాగి ఉన్న నటనతో నాగ్‌ అశ్విన్‌.. నవ్వించాడు, ఏడిపించాడు, స్నేహం విలువ తెలిపాడు, ప్రేమకున్న బంధం ఇదని సూచించాడు. ఒక్కటేమిటి.. ఆ చిత్రంతో ఓ జీవిత సత్యాన్నే చెప్పాడని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. నాని, విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఇప్పుడెలా ఉందో తెలియందికాదు. వాళ్లు ఆ రేంజ్‌కి వెళ్లడానికి పూర్తి స్థాయిలో ఈ చిత్రమే కారణమని చెప్పలేం కానీ.. ఖచ్చితంగా ఈ చిత్రం కూడా ఒకటని వారే పలు సందర్భాలలో చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో రిషి పాత్రని మలిచిన తీరుకి నాగ్‌ అశ్విన్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పొచ్చు. అసలు ఇలాంటి కథతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన, అందులోనూ మొదటి చిత్రంగా ఎన్నుకోవడం నిజంగా స్వప్నా, ప్రియాంకల ఘట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాలి.

  1. మహానటి

స్వప్నా సినిమా బ్యానర్‌లో రెండో చిత్రంగా వచ్చిన ‘మహానటి’ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఒక మహానటి జీవిత చరిత్రను రెండో సినిమాగా ఎన్నుకోవడం, ఎక్కడా రీమార్క్‌ లేకుండా.. ఎటువంటి కాంట్రవర్శీలు లేకుండా.. ఆ సినిమాని పూర్తి చేయడం కేవలం స్వప్నా, ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌లకు మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని వారు ఎలా తీశారా? అంటూ సినీ మేధావులే ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. వైజయంతీ మూవీస్‌లో అగ్రనిర్మాత అశ్వనీదత్‌ ఎన్నో సినిమాలు చేసి సంపాదించుకున్న కీర్తిని.. ఈ ఒకే ఒక్క చిత్రంతో వారు సంపాదించుకోవడం విశేషం. ఇక ఈ చిత్రంలో సావిత్రి కాలం నాటి లుక్‌ కోసం వారు తీసుకున్న జాగ్రత్తలు, ఎన్నుకున్న ఆర్టిస్ట్‌లు.. ఒక్కటేమిటీ ప్రతీదీ పర్ఫెక్ట్ అనేలా ఈ చిత్రాన్ని.. సారీ ఆణిముత్యాన్ని మలిచారు. ఈ చిత్రంతో కీర్తిసురేష్‌ మహానటిగా స్థిరపడిపోవడమే కాకుండా.. జాతీయ స్థాయి గుర్తింపును సైతం అందుకుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే.. ఈ సినిమా గురించి చెప్పడానికి ఇక్కడ ప్లేస్‌ సరిపోదు. మహానటిని మళ్లీ చూపించి.. ఆమె గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వాస్తవికతతో బహిరంగం చేసిన తీరుకు యావత్తూ ఇండస్ట్రీ జేజేలు పలికింది. స్వప్నా సినిమా బ్యానర్‌ రెండో సినిమాతోనే ప్రపంచ స్థాయి గుర్తింపును సైతం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ఈ బ్యానర్‌లో ఏం సినిమా వస్తుందా? అని అంతా వేచి చూస్తున్న క్రమంలో.. నాగ్‌ అశ్విన్‌ వినూత్న పంథాలో సినిమాని సెలక్ట్ చేసుకుని.. తను నిర్మాతగా వేరే దర్శకుడితో ఈ బ్యానర్‌లో సినిమా చేశారు. ఆ చిత్రమే ‘జాతిరత్నాలు’. ఈ చిత్రం ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే.. విడుదలైన టీజర్‌, ట్రైలర్లతో ఈ సినిమా స్థాయి కూడా వేరు అనేలా అయితే అనిపించుకుంటోంది. యువ నటీనటులతో నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా చేసిన ఈ ప్రయత్నంతో స్టార్‌ స్టేటస్‌ అందుకునేది ఎవరో? అని కూడా అప్పుడే ఇండస్ట్రీలో చర్చలు మొదలెట్టారు. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘సినీరత్నాల’ను అందించే సంస్థగా ‘స్వప్నా సినిమా’కు పేరు రావడం మాములు విషయం కాదు. ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ‘సినీరత్నాల’ను ఇండస్ట్రీకి అందిస్తున్న ఈ సంస్థ మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు తీయాలని, మరికొంతమంది ‘జాతిరత్నాలు’.. అదే ‘సినీరత్నాల’ను ఇండస్ట్రీకి ఇవ్వాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here