మార్చి 11, మహాశివరాత్రి.. ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైన రోజు.. ఆయన భక్తులకు మహా ఆనందకరమైన రోజు. తెల్లవార్లు జాగారం చేసి.. నియమ నిష్టలతో భక్తులు శివుడిని ఆరాధిస్తారు. అలాంటి పరమశివుడికి మరో పేరైన హరిహర టైటిల్‌తో.. అభిమానులు దేవుడిగా భావించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెమరబుల్ ట్రీట్ ఇచ్చారు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రాబిన్‌హుడ్ తరహా పాత్రలో ఆయన నటించిన చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ని శివరాత్రి కానుకగా నేడు(గురువారం) విడుదల చేశారు. ఎప్పుడైతే ఈ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వస్తుందని టైమ్ ప్రకటించారో.. అప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ట్యాగ్‌లతో పవన్ అభిమానుల హడావుడి కొనసాగుతూనే ఉంది. ట్రెండ్‌లో సంచలనాలను క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై డేరింగ్ అండ్ డ్యాషింగ్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పినట్లుగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌తో పవన్ కల్యాణ్‌ని పవర్ ఫుల్‌గా చూపిస్తూ వదిలిన ఫస్ట్ లుక్‌తో.. మెగాభిమానులకు పూనకాలు వస్తున్నాయంటే నమ్మాలి మరి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతోన్న ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. పీరియాడికల్ నేపథ్యంలో ఫాంటసీ చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ రూపొందుతున్నట్లుగా అర్థమవుతోంది. ఈ తరహా లుక్‌తో పవన్ కల్యాణ్ నుంచి ఇంత వరకు చిత్రం రాలేదు. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో.. పవన్‌ని ఇలా చూడాలని కలలు కంటున్నారు. వారి కలలను నిజం చేస్తున్న ఘనత మాత్రం క్రిష్, రత్నంలకే చెందుతుంది. ఏపీలో వేడెక్కిన హీట్ రాజకీయాలలో కీలకపాత్ర వహిస్తున్న పవన్‌ని.. ఈ తరహా కథతో ఒప్పించడం అంటే.. మాములు విషయం కాదు. ఖచ్చితంగా పవన్‌తో చరిత్ర సృష్టించాలనే క్రిష్, రత్నం ప్లాన్ చేశారా?.. లేదంటే అసలు ఆ లుక్ ఏంటి?. చూస్తుంటేనే గూజ్‌బంప్స్ వస్తున్నాయ్.. చరిత్రను తిరగరాసే వీరుడు, ధీరుడు, యోధుడుగా ఈ వీరమల్లు రెడీ అవుతున్నాడనేది ఈ లుక్‌తో అర్థమవుతోంది. ఈ లుక్ తర్వాత పవన్ కల్యాణ్‌నే కాదు.. ఆయనతో ఈ సినిమా చేస్తున్న క్రిష్‌ని, రత్నంని కూడా ఆయన అభిమానులు ఆరాధించడం ఖాయం.
పీరియాడికల్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో.. అసలు వెనకడుగు వేయకుండా.. భారీ సెట్స్‌తో రూపొందిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కట్టడాలన్నింటిని.. ఈ చిత్రంలో చూపించి.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కూడా ఆ కాలానికి తీసుకెళ్లేందుకు క్రిష్ ఓ కంచుకోటని సిద్ధం చేస్తున్నట్లుగా.. చాలా రోజులుగా పవన్ కల్యాణ్ సినిమా కోసం వేచి చూస్తున్న మెగాభిమానులకు కాచుకోండి అనేలా శపథం చేస్తున్నట్లుగా.. ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్నట్లుగా ఈ లుక్‌తో ఓ హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా.. ఈ సినిమా గురించి, జరిగే బిజినెస్ లెక్కలు గురించి చర్చలు మొదలవుతాయి. ఏరియాల వైజ్‌గా నమోదయ్యే రికార్డులను తెలియజేయడానికి ట్రేడ్ నిపుణులకు పనికల్పించబోతున్నాడీ వీరమల్లు. ఫస్ట్ లుక్‌తోనే ట్రెండ్‌లో ఓ ఆటాడేస్తున్నాడీ ‘హరిహర వీరమల్లు’.