
ప్రేమను దాచాల్సిన అవసరం నాకు లేదు!
రాధికా ఆప్టే… తెరపై బోల్డ్ పాత్రల్లో నటించడానికి ఏమాత్రం మొహమాటపడదు. బయట కూడా తనకు ఏం అనిపిస్తే అది మాట్లాడుతుంది. ఆ గుణమే.. రాధికకు అభిమానుల్ని సంపాదించిపెట్టింది. తన నటనతో అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకొన్నరాధికకు కాస్త కోపం ఎక్కువే. “హీరోలు, హీరోయిన్లు అనే తేడా. చిత్రసీమలో ఎక్కువగా కనిపిస్తుంది. ఓ సినిమా కోసం మా కంటే హీరోలు కాస్త ఎక్కువ కష్టపడతారేమో? కానీ అందుకొనే పారితోషికం అందుకు వంద రెట్లు ఎక్కువ ఉంటుంది. కథానాయికలు కూడా ఎందులోనూ తీసిపోరు. ఆత్మాభిమానం కోసం పోరాడే ప్రతీ అమ్మాయి నా దృష్టిలో హీరో కంటే ఎక్కువ” అంటోంది రాధిక.
బాలీవుడ్లో రాధికా ఆప్టే చుట్టూ గాసిప్పులు మూగాయి. ‘షోర్ ఇన్ ద సిటీ’ సినిమాలో నటిస్తున్నప్పుడు సహనటుడు తుషార్ కప్పూర్ ప్రేమలో పడిందని, ఇద్దరూ సహజీవనం చేశారని వార్తలొచ్చాయి. ఆ తరవాత తాను నటించే ప్రతీ సినిమాలోనూ హీరోలతో లింకులు పెడుతూ గాసిప్పులు అల్లారు. వాటిని ధైర్యంగానే ఎదుర్కొంది రాధిక. “ప్రేమలో పడడం చాలా సహజమైన విషయం. దాచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. మీడియా ఏం రాస్తే అది నిజమని నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు” అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది రాధిక. 2012లో బెనెడెక్ట్ టేలర్ అనే ఓ బ్రిటీష్ మ్యుజీషియన్ని ప్రేమించి పెళ్లి చేసుకొంది.
నాటకరంగంతో రాధికకు అనుబంధం ఉంది. ఆ ప్రయాణంలోనే సినిమా వాళ్లతో పరిచయాలయ్యాయి. మరాఠీలో నాటకాలు ప్రదర్శించే మోహిత్ టక్లర్ థియేటర్స్తో జట్టు కట్టింది. ఆ సంస్థ ప్రదర్శించే నాటకాల్లో కీలక భూమిక పోషించింది.’లస్ట్ స్టోరీస్’, ‘అంధాదూన్’ రాధికకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్లో రాధిక బోల్డ్ గా నటించిన విధానం విమర్శకుల మన్ననలు పొందింది.