షర్మిల పార్టీ పెట్టడానికి కారణం అదే.. దమ్ముంటే ఏపీలో పొటీ చేయాలి.. డీకే అరుణ ఛాలెంజ్

0
160
Spread the love

వైఎస్ కుటుంబంపై బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) సంచలన కామెంట్స్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆమె.. వైయస్సార్ కుటుంబం (YSR Family)లో వచ్చిన విభేదాల వల్ల వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీ పెట్టారన్నారు. గతంలో వైఎస్ కుటుంబం ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయ లేదని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంత వరకు.. ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. షర్మిల ఎపీలోనే పోటీ చేయవచ్చు కదా… తెలంగాణ లో ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో కూడా ఎపీలోనే షర్మిల ప్రచారం చేశారని.., అప్పుడు తెలంగాణలో ఆమె ఎక్కడ ఉన్నారన్నారు. ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదో షర్మిల చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

ఇక విజయవాడ (Vijayawada) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆమె.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని, జాతీయ వాదాన్ని చాటిచెప్పాలన్నారు. మన దేశ జెండా గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్న డీకే అరుణ.., దేశ వ్యాప్తంగా 20కోట్ల ఇళ్లపై జెండాలు ఎగుర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటి పైనా జాతీయ జెండా రెపరెపలాడాలన్నారు.

ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలపైనా డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమని.. విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారని.. అప్పుడు అంగీకరించిన కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముంపు మండలాల ప్రజలు తెలంగాణలో కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని.. అక్కడ మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు తీర్చకపోవడంతో ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయన్నారు.

బీజేపీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఎదురుచూస్తున్నారని.. ఈ జాబితాలో కిందస్థాయి నేతల నుంచి పెద్ద నాయకుల వరకు ఉన్నారన్నారు. ఐతే వారిని ఏ సమయంలో చేర్చుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో టీఅర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కాళేశ్వరం విషయంలో జగన్, కేసిఆర్ పై మంచి అండర్ స్టాండింగ్ ఉందని.. ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని డీకే అరుణ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here