కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు ఇవే!

0
284
Spread the love

రాజకీయ ప్రయోజనలే ముఖ్యంగా పనిచేసే రాజకీయ నాయకుల అసత్య ప్రచారాలు ఎల్లప్పుడూ నిజం కావు. తమ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టడం బాధాకర విషయం. మానవ మాత్రులకు అంతు చిక్కని ప్రకృతిని అంచనా వేయడం అసాధ్యం. అలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడే తప్ప దానిని మించి సాహసం చేయడు. ప్రకృతికి ఉండే శక్తి అలాంటిది. సరిగా ఇలానే జరిగింది కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో. దీనిని గమనించని కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

కాళేశ్వ‌రం పంప్‌హౌసుల్లోకి నీరు ఎందుకు చేరింది .. ?
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అతి త‌క్కువ స‌మ‌యంలో అంటే మూడేళ్ల‌లో గోదావ‌రి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా. గోదావ‌రి న‌దికి గ‌త నెల‌లో వ‌చ్చిన అతి భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల మేడిగ‌డ్డ ల‌క్ష్మీ పంప్‌హౌస్‌తోపాటు, క‌న్నెప‌ల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు ముంపుకు గుర‌య్యాయి. దీంతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు అన‌వ‌స‌ర‌మ‌ని, నిర్మాణంలో లోపాలున్నాయ‌ని, డిజైన్‌లో లోపాలున్నాయ‌ని ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు నిరాధార ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళాన్ని సృష్టించే బ‌ల‌మైన ప్ర‌య‌త్నం వ్యూహాత్మ‌కంగా చేస్తున్నారు.

వాస్తవాలు చూస్తేనే కదా..
ఏ ప్రాజెక్టును నిర్మించాల‌న్నా ఆ ప్రాజెక్టుకు సంబంధించి క‌నీసం 100 నుంచి 500 సంవత్సరాల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. అలా లెక్క‌క‌ట్టిన త‌రువాతే 28.8 లక్షల క్యూసెక్కుల వరద ఫ్రీక్వెన్సీని తట్టుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లకు CWC హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. దీని ప్రకారం బ్యారేజీకి 85 గేట్లను కూడా బిగించారు.

1986లో కాళేశ్వరం వద్ద అత్యధికంగా 107.05 మీటర్ల వరద నమోదైంది, దీని ఆధారంగా CWC అనుమతులు ఇచ్చింది. పంప్ హౌస్, రక్షణ గోడలు కూడా తదనుగుణంగా రూపొందించబడ్డాయి. వాట‌ర్ కమీషన్ లెక్క‌ల ప్రకారం, గోదావరి నదిలో 103.5 మీటర్ల వరద స్థాయిని హెచ్చరిక స్థాయిగా, 104.75 మీట‌ర్ల వ‌ద్ద ప్రమాద స్థాయిగానూ పరిగణిస్తారు.
కానీ 2022 జూలై 14న, కాళేశ్వరం వద్ద గోదావరి నది వ‌ర‌ద 108.18 మీటర్లుగా నమోదైంది, ఇది 1986లో నమోదైన 107.05 మీటర్ల కంటే ఎక్కువ. CWC రికార్డుల ప్రకారమే ఆ రోజు కాళేశ్వరం వద్ద సుమారు 28-29 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. అంటే అనూహ్య‌మైన భారీ వరద స్థాయి కారణంగానే పంప్ హౌస్‌లు మునిగిపోయాయి త‌ప్ప, డిజైన్ లేదా నిర్మాణ నాణ్యత సరిగా లేక కాదు.

ఊహించని భారీ ఇన్ ఫ్లో కారణంగానే మునక ..
నదిలోకి వచ్చే వరద, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌ను పరిగణనలోకి తీసుకున్నతర్వాతే గేట్‌లతో పాటు డ్యామ్‌లు, బ్యారేజీలు డిజైన్ చేస్తారు. వరదల సమయంలో, బ్యారేజీ గేట్లను ఎత్తివేసి, దిగువకు నీరు స్వేచ్ఛగా ప్రవహించేందుకు వీలుగా ప్రవాహ స్థితిలో ఉంచుతారు. వరదలను నివారించడానికి, బఫర్ స్థాయిలను మెరుగుపరచడానికి మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ప్రతిపాదిత 77 నుండి 85 కి పెంచారు. వరదల సమయంలో గేట్లు ఎత్తివేసి ఫ్రీ ఫ్లో కండిషన్‌లో ఉంచడం వల్ల నదిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నీరు ప్రవహిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఉన్న బ్యారేజీలన్నీ ఈ ఏడాది జులై నుంచి ఫ్రీ ఫ్లోలో ఉన్నాయి. దీంతో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వచ్చే పరిస్థితి పెద్ద‌గా లేదు.ఏదైనా నది సహజ ప్రవాహ సామర్థ్యానికి మించి భారీ ఇన్‌ఫ్లోల కారణంగా నీటి మట్టాలు పెరుగుతాయి. జూలై 13, 14 తేదీల్లో కాళేశ్వరం సమీపంలోని ప్రాణహిత నుంచి 29 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో నమోదైంది. గోదావరి నదికి ఒక్కసారిగా అంత పెద్ద ఇన్ ఫ్లో రావ‌డంతో నీటిమట్టం 108 మీటర్లు దాటింది. 1986లో గోదావరి నదిపై బ్యారేజీ లేకపోయినా నీటిమట్టం 107.05 మీటర్లకు చేరుకుంద‌ని రికార్డులు చెబుతున్నాయి.గోదావరి నది పూర్తి ఉధృతంగా ఉన్నప్పుడు, చిన్న వాగుల నుండి నీటి ప్రవాహం దానిలో చేరక‌పోగా వెన‌క్కి తిప్పికొడుతుంది, ఫలితంగా ఎగువ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఉదాహరణకు చందనాపూర్ వాగు గోదావరి నదిలో కలిసే అవకాశం లేకపోవడంతో నీటి ప్రవాహం తగ్గింది. అన్నారం పంప్‌హౌజ్‌కు రక్షణగా నిర్మించిన మట్టికట్టపై నీరు పొంగి ప్రవహించింది. చందనాపూర్ వాగులో గతంలో ఎన్నడూ ప్ర‌వాహ మ‌ట్టం 0.5 మీటర్లు దాటకపోగా, ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 2 మీటర్ల మేర నీరు చేరింది.

గతంలో ఎక్కడా జరగలేదా..?
మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక మాటలు అనేస్తే సరిపోతుందిలే అనుకుంటే అది రాజకీయ నాయకుల పోరబాటే అవుతుంది. ఏదైనా ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరదలు వచ్చినప్పుడు అది దెబ్బతింటుంది. అతి ఒక్క కాళేశ్వ‌రంలోనే కాదు, గ‌తంలో శ్రీ‌శైలం డ్యామ్‌, ఉత్త‌ర‌ఖాండ్‌లోని 6 హైడెల్ ప‌వ‌ర్‌స్టేష‌న్స్, రిషీగంగా, ధూలి గంగా వంటి ఎన్నో ప్రాజెక్టులు ఇలా నీట మునిగాయి. మరి ఇవన్నీ వీటిని నిర్మించిన కంపెనీలదా తప్పు.
2009లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదల కారణంగా శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్, శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్ టన్నెల్, కర్నూలు పట్టణం కూడా ముంపునకు గుర‌య్యాయి. శ్రీశైలం డ్యాంకు 13 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉన్నప్పటికీ దాదాపు 25 లక్షల క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో వరద పోటెత్తింది. మొత్తం 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన‌ప్ప‌టికీ శ్రీ‌శైలం విద్యుత్ కేంద్రం నీట మునిగింది. ప‌వ‌ర్ హౌస్ ప్రొటెక్షెన్ వాల్ సైతం నీటిలో కొట్టుకుపోయింది. దాన్ని తిరిగి బాగు చేయ‌డానికి ఏడాది కాలం ప‌ట్టింది. కానీ ఆ రోజు ఏ ఒక్క‌రూ శ్రీ‌శైలం విద్యుత్ కేంద్రం నీట మునిగిపోవ‌డం ప‌ట్ల రాజ‌కీయం చేయ‌లేదు.

డిజైన్ల లోపం వల్లే అయితే ప్రాజెక్ట్ మొత్తం ఎందుకు కూలలేదు.. ?
ఇప్పుడు కాళేశ్వ‌రంలోని మేడిగడ్డ పంప్ హౌజ్ ముంపు ప్రాంతంలో నీటి మట్టం అధిక వరద స్థాయిని (హెచ్‌ఎఫ్‌ఎల్) అధిగమించడంతోనే నీటమునిగింది. అనూహ్య‌మైన వ‌ర‌ద‌వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది తప్ప‌ ప్రాజెక్టు డిజైన్ కారణంగానో, నిర్మాణ‌లోపాల కార‌ణంగానో కానేకాదు. 1986నాటి గోదావ‌రి వ‌ర‌ద‌ల రికార్డు ప్ర‌కారం మేడిగ‌డ్డ ల‌క్ష్మీ బ్యారేజ్ గ‌రిష్ట డిశ్చార్జి కెపాసిటీని 18 ల‌క్ష‌ల క్యూసెక్కులుగా లెక్కించారు. 2086లో కూడా ఇంతే స్థాయి వ‌ర‌ద వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారు. కానీ గ‌త నెల‌లో వ‌ర‌ద 28 ల‌క్ష‌ల క్యూసెక్కులుగా రికార్డ‌యింది. అంటే 35 ఏళ్ల‌కే వందేళ్ల వ‌ర‌ద అంచ‌నాను మించి వ‌చ్చింది. ఈ ర‌కంగా వ‌ర‌దల‌కు సంబంధించి కేంద్ర జ‌ల‌సంఘం వంటి సంస్థ‌లు శాస్త్రీయంగా వేస్తున్న అంచ‌నాలు కూడా తారుమారు అవుతున్నాయి.

మేడిగ‌డ్డ వ‌ద్ద స‌ముద్ర‌మ‌ట్టం 100 మీట‌ర్లు అయితే, బ్యారేజ్ 106 మీట‌ర్ల ఎత్తులో నిర్మించారు. పంప్‌ల‌ను 111 మీట‌ర్ల ఎత్తులో అమ‌ర్చారు. కానీ జూలైలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం 6.7 మి.మీ. కుర‌వాల్సి ఉండ‌గా, 39.5 మి.మీ. కురిసింది. అంటే 490 శాతం ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంది అన్న‌మాట‌. అతి త‌క్కువ కాలంలో అతి ఎక్కువ వ‌ర్షం కుర‌వ‌డం, క్యాచ్‌మెంట్ ఏరియా అంత భారీ వ‌ర‌ద‌ను త‌ట్టుకోలేక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వాట‌ర్ స్టాగ్నేష‌న్ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం వంటి, నీరు స్వేచ్ఛ‌గా ప్ర‌వ‌హించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ కాళేశ్వ‌రం పంప్‌హౌస్‌లు నీట మునిగాయి త‌ప్ప డిజైన్ లోపం, నిర్మాణ లోపం కానేకాదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు వాస్తవాలను గ్రహించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారే తప్ప అబద్ధాలను అసలు నమ్మరని వారు గుర్తేరగాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here