
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హీరోగా ఎంత పాపులారిటీ సంపాదించారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక విమర్శలకు తావిచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకోవడం యాదృచ్చికంగా జరిగినా, ప్రజా జీవితంలోకి ప్రవేశించాక అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో మూడు వివాహాల గురించి పవన్ వివరణ ఇచ్చు కోవాల్సి వచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చూద్దాం…
పవన్ కళ్యాణ్ అనగానే అగ్రహీరోగానే కాదు. వివాహాల వివాదాల్లోనూ ఆయన అగ్ర స్థానంలోనే నిలిచారు. అది 1997. పవన్ కళ్యాణ్ అంటే మెగాస్టార్ తమ్ముడిగానే అందరికీ పరిచయం. ఆ రోజుల్లోనే విశాఖకు చెందిన నందిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వారి వివాహ జీవితం సవ్యంగా సాగలేదు. ఆ తరవాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాగా బిజీ అయిపోయారు. ఆ సమయంలోనే అప్పటి ప్రఖ్యాత హీరోయిన్ రేణూ దేశాయ్ ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. దీంతో నెలకు ఐదు లక్షల భరణం ఇప్పించాలంటూ నందిని విశాఖ మెట్రోపాలిటిన్ కోర్టులో కేసు వేసింది. దీంతో పవన్ కళ్యాణ్ రహస్యంగా చేసుకున్న రెండో వివాహం వివాదాల్లో పడింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం న్యాయపరమైన చిక్కులు తెచ్చి పెట్టింది. దీంతో పెద్దల సహకారంతో నందినికి పరిహారం చెల్లించి విడాకులు పొందారు. అయితే రేణూదేశాయ్ ను వివాహం చేసుకోకుండానే పిల్లలను కన్నారని, అది చట్ట విరుద్దం అంటూ ఎంతో మంది రాజకీయ విమర్శలు చేశారు. దీంతో రేణా దేశాయ్ కు పిల్లలు పుట్టిన తరవాత అగ్ని సాక్షిగా వివాహ మాడారు. అయితే అది కూడా ఎంతో కాలం నిలవలేదు. 2012లో రేణాదేశాయ్ కు విడాకులు ఇచ్చారు..
రెండు పెళ్లిళ్లు, రెండు విడాకుల అనంతరం మరలా పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ అయ్యారు. తీన్ మార్ సినిమాల్లో నటించిన రష్యాకు చెందిన అన్నా లెజ్నేవాను 2013లో హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ద్వారా వివాహం చేసుకున్నారు. దీంతో ఒక పవన్ కళ్యాన్ మూడు పెళ్లిళ్లు అంటూ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్బావం తరవాత మరోసారి ప్రజా జీవితంలో అడుగు పెట్టడంతో పవన్ కుటుంబంపై రాజకీయ విమర్శలతో దాడి చేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. ఇవేమీ పవన్ పట్టించుకోలేదు. ప్రజాసేవ చేసుకుంటూ జనాలకు జవాబుదారీగా నిలిచారు. పవన్ మూడు పెళ్లిళ్లు అంటూ ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలుసుకున్న వైసీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. అయితే మూడు పెళ్లిళ్ల గురించి పవన్ ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. తాను ఏనాడూ మూడు వివాహాలు చేసుకోవాలని భావించలేదని, అనుకోకుండా అలా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. రాసిపెట్టి ఉంటే తప్పించుకోలేరు అనడానికి ఇదే ఉదాహరణ.
ఎవరెన్ని విమర్శలు చేసినా…. సినీ కెరీర్ పణంగా పెట్టి ప్రజాసేవకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రజల ఆశీస్సులు దక్కుతున్నాయి. పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఆయన వ్యక్తిగతం. అనవసరంగా విమర్శలు చేస్తే వారి పరువే పోతోందని వైసీపీ నేతలు గ్రహించారు. దీంతో పవన్ మూడు వివాహాల వివాదాలు తెరమరుగయ్యాయి.