పసుపు.. ఈ పేరు తెలియని వారుండరు. ఇటు వంటింట్లో, అటు శుభకార్యాలకు పసుపును విరివిగా ఉపయోగిస్తారు. అసలు పసుపు లేకుండా ఏ పని కూడా ముందుకు జరగదు. ఎందుకంటే పసుపునకు భారతీయ సంప్రదాయంలో అంత ప్రత్యేకత ఉంది. దాన్ని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తుంటారు. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పసుపు అందిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే దీనిని చాలామంది తమ డైట్లో చేర్చుకుంటారు. అయితే డయాబెటిస్, కిడ్నీ సమస్యలతో బాధపడే వారు పసుపునకు, దాని సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్‌తో బాధపడేవారు పసుపును తగ్గిస్తే మంచిది. ఎందుకంటే పసుపు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు చక్కెర స్థాయిలను తగ్గించుకునేందుకు మెడిసిన్స్ వాడుతుంటారు. పసుపు, మెడిసిన్స్ రెండు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. షుగర్ పేషెంట్స్ కాస్త పసుపును తగ్గిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. పసుపునకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పసుపులోని ఆక్సలేట్ కాల్షియంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని పలు పరిశోధనలు తేల్చాయి. పిత్తాశయం సమస్యలుంటే.. పసుపు మీ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది. పసుపులోని ఆక్సలేట్ ఉంటుంది. ఇది పిత్తాశయం సంకోచాలను ప్రేరేపిస్తుంది. పిత్తాశయ సమస్యను అభివృద్ధి చేస్తుంది.
ఐరన్ లోపంతో బాధపడేవారు కూడా పసుపును కాస్త తగ్గించే తీసుకుంటే మంచిది. పసుపు జీర్ణాశయంలోని ఐరన్ శోషణను ప్రభావితం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పసుపునకు దూరంగా ఉంటే మంచిదిట. గర్భధారణ సమయంలో లేదా పాలు ఇచ్చే సమయంలో సప్లిమెంట్లు తీసుకోకపోవడమే మంచిదని పరిశోధనలు తేల్చాయి.