చోళ రాజ్యం నేప‌థ్యంతో నిర్మించిన‌ పొన్నియన్ సెల్వన్ చరిత్ర సృష్టిస్తుందా?

0
63
Spread the love

పొన్నియన్ సెల్వన్. ది సన్ ఆఫ్ పొన్ని నవల. తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన చారిత్రక కల్పిత నవల. చోళ చక్రవర్తుల చరిత్రకు కల్పితం జోడించి 1950లో ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించింది. ఈ నవల ఆధారంగా ఎంజీఆర్ సహా ఎందరో సినిమా తీయాలని చూశారు. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించక వదిలేశారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్ తో పొన్నియన్ సెల్వన్ తెరకెక్కుతోంది. దీంతో పొన్నియన్ సెల్వన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చారిత్రక, కల్పిత నవలా విశేషాలు చూద్దాం..

పొన్నియిన్ సెల్వన్ అనేది తమిళంలో వ్రాసిన నవల. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1950లో రచించిన చారిత్రక కల్పిత నవల చాలా పాపులర్ అయింది. ఈ నవల మొదటిసారిగా 1950 నుండి 1954 వరకు కల్కి వార పత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. ఆ తరవాత 1955లో ఐదు భాగాలుగా పుస్తక రూపంలో విడుదలైంది. ఐదు సంపుటాల్లో 2210 పేజీల్లో ఈ కథను వివరించారు రచయిత. ఇది చోళ చక్రవర్తి అరుల్మొళివర్మన్ ప్రారంభ రోజుల కథను చెబుతుంది. తరువాత గొప్ప చోళ చక్రవర్తి అయిన రాజరాజ చోళ I, దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.

పొన్నియిన్ సెల్వన్ తమిళ సాహిత్యంలో గొప్ప నవలగా చాలా మంది కొనియాడుతూ ఉంటారు. కల్కి వార పత్రికలో వారానికొకసారి ప్రచురితమైన ఈ ధారావాహికకు ఉన్న క్రేజ్ ఏమిటంటే, ఇది పత్రిక సర్క్యులేషన్‌ను 2 వేల నుంచి ఒకేసారి 71366 కాపీల స్థాయికి చేరుకునేలా చేసింది.నేటికీ, ఈ నవలకి అన్ని తరాల ప్రజల్లో ఫాలోయింగ్ ఉంది. పటిష్టంగా అల్లిన కథాంశం, స్పష్టమైన కథనం, సంభాషణలోని చతురత , చోళ సామ్రాజ్యం యొక్క అధికార పోరాటం, కుతంత్రాలు చిత్రీకరించబడిన విధానాల గురించి పుస్తకంలో వ్రాసిన అంశాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

పొన్నియిన్ సెల్వన్ నావెల్ ఆధారంగా సినిమా చేయాలని నాటి ఎంజీఆర్ నుంచి రజనీకాంత్ వరకూ అందరూ ప్రయత్నించారు. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించక వదిలేశారు. చారిత్రక, కల్పిత కథ కావడం 50 ప్రధాన పాత్రలు ఉండటంతో ప్రముఖ నటుల డేట్స్ దొరక్క పోవడం, భారీ బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా మంది వారి ప్రయత్నాలు విరమించుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కూడా మూడు దశాబ్దాలుగా ఈ నవల ఆధారంగా సినిమా చేయాలని ప్రయత్నించారు. కోవిడ్ సమయంలో ఆయన కల ఫలించింది.

సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో ప్రముఖ నటుల డేట్స్ ఆయనకు దొరికాయి. ప్రముఖ హీరో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, నాజర్ వంటి ప్రముఖ నటీనటులతో సహా 50 ప్రధాన పాత్రలు ఇందులో ఉన్నాయి. నాచురల్ గా ఉండటం కోసం 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో మైలు రాయిగా మిగిలి పోనుందని టీజర్ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. సినిమా విడుదల కాకముందే పొన్నియిన్ సెల్వన్ అంచనాలను భారీగా పెంచేస్తోంది.

చోళ రాజకుమారుడు ఆదిత్య కరికాలన్ యువరాణికి సందేశాన్ని అందించడానికి చోళ దేశం మీదుగా బయలుదేరిన వంద్యతేవన్ చుట్టూ కథ తిరుగుతుంది. చోళ దేశంలో వంద్యతేవాన్ ప్రయాణాలు, యువరాజు అరుల్మొళివర్మన్ శ్రీలంకలో ప్రయాణించడం మధ్య కథ నడుస్తుంది. అశాంతి, అంతర్యుద్ధంతో సామంతులు, చిల్లర నాయకుల పన్నాగంతో చుట్టుముట్టబడిన తమిళభూమిలో రాజకీయ శాంతిని నెలకొల్పడానికి అరుల్మొళివర్మన్‌ను తిరిగి తీసుకురావడానికి అతని సోదరి కుందవై చేసిన ప్రయత్నాలతో కథనం మరింత రక్తికడుతుంది. ఈ చారిత్రక కథను తెరకెక్కించడంలో మణిరత్నం సాహసం చేశారనే చెప్పవచ్చు. సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు రెండు సంవత్సరాలు నడిచాయి. త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. మొదటి భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here