Homeఆంధ్రప్రదేశ్ఏపీలో విచిత్రమైన రాజకీయం

ఏపీలో విచిత్రమైన రాజకీయం

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది ఏపీ రాజకీయం చాలా విచిత్రంగా తయారవుతోంది. విషయం ఏమిటంటే ఏ పార్టీ నేత మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో చెప్పటం కష్టమైపోతోంది. దీనికి కారణం ఏమిటంటే అధినేతలు టికెట్లు నిరాకరించటమే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు. తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తుందో చూసుకుని, అధినేతలతో మాట్లాడుకుని పార్టీలు మారిపోతున్నారు. తెల్లారి ఒక పార్టీలో ఉన్న నేత మధ్యాహ్నానికి ఇంకో పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కొలుసు పార్థ‌సార‌థి, వసంత కృష్ణప్రసాద్, రక్షణనిధి, కైలే అనీల్ కుమార్ వంటి మరో 25 మందికి టికెట్లు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. వీరిలో కొలుసు, వసంత టీడీపీలో చేరిపోయారు. కొలుసుకు చంద్రబాబునాయుడు నూజివీడులో టికెట్ ఇచ్చారు. వసంతకు మైలవరంలో టికెట్ వస్తుందని అంటున్నారు. రక్షణనిధి, కైలే పరిస్థితి అయోమయంగా ఉంది. అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి దూకి గురజాల టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరి టికెట్ ఖాయం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వైసీపీలో చేరగానే టికెట్ దక్కించుకున్నారు. ఇక వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలోకి దూకి టికెట్ ఖాయం చేసుకున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ జనసేనలో చేరారు. ప్రస్తుతానికి భీమిలీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నారు.. టికెట్ వస్తుందో లేదో తెలియ‌దు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినా రెండు నెలలకే మళ్ళీ ఘర్ వాపసీ అయిపోయారు. కాపు రామచంద్రారెడ్డికి రాయదుర్గంలో టికెట్ రాదని తేలిపోయింది. చాలాకాలంగా పార్టీలో యాక్టివ్‌గా లేరు. మరి ఏ పార్టీలోకి మారుతారో తెలియ‌దు.

వైసీపీలో సుమారు 25 మందికి టికెట్లు రాకపోయినా పార్టీ మారింది మాత్రం ఐదారుగురే. మరికొందరు ఇతర పార్టీల్లో టికెట్ల హామీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధాంతాల కన్నారాద్దాంతాలే ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయింది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు కాని ఇంకా టీడీపీలో చేరలేదు. ఇది ఈ రోజు పరిస్థితి రేపటి పరిస్థితి ఏమిటో ఎవరు చెప్పలేకున్నారు.

RELATED ARTICLES

Most Popular