ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇతోధిక ప్రగతి సాధించింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాలనతో పోలిస్తే గత నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖనే ఆ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వంలో పెట్టుబడులే రావడం లేదని ఊకదంపుడు వార్తాకథనాలు రాస్తున్నాయి.
వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 – 18 మధ్య చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే 2019 నుంచి 2023 జూన్ వరకు వైఎస్ జగన్ పాలనలో 226.9 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు పాలనలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమ పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు.
వైఎస్ జగన్ పాలనలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ పెట్టుబడుల సదస్సుల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు బోగస్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపం దాలుస్తాయి. కానీ విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగి ఏడాది కాకుండానే జగన్ ప్రభుత్వ హయాంలో 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి.
జిఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగగా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారం అందించడం వల్ల రియలన్స్, ఆదానీ, టాటా, బిర్లా, హెచ్‌యూఎల్, బ్లూస్టార్, డైకిన్, ఇన్ఫోసిస్ వంటి పలు దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి.