ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. అయితే.. అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం డిఫరెంట్‌గా ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే… మళ్లీ వైఎస్ జగనే ఎందుకు అధికారంలోకి రావాలంటే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్(jagan) ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లనున్నారు. వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ కార్యక్రమాలు ముందుకు సాగుతాయని వారు వివరించనున్నారు. దాంతో పాటు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలు ఆగిపోతాయని కూడా ప్రజలకు చెప్పాలని అనుకుంటన్నారట.
మూడు సిద్ధం సభల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన వైఎస్ జగన్ ఎన్నికల వ్యూహంపై సీనియర్ నాయకులతో చర్చించారు. రాప్తాడు సిద్ధం సభ అనూహ్యమైన విజయం సాధించింది. ఈ సభకు పది లక్షల మందికిపైగా హాజరయ్యారు. త్వరలోనే పల్నాడులో మరో సిద్ధం సభను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పంచ్ డైలాగులు, ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో ఆయన పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నారు.
అంతేకాదు.. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్ ఈ సారి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara Reddy) బాటలోనే నడవనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికను ఆయన ప్రకటించారు. ప్రజల కోసం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను అందులో చేర్చారు. దాంతో కాంగ్రెస్ విజయం సాధించి, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో మాత్రం భారీ పథకాలను ప్రకటించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పథకాలు కొనసాగుతాయని చెప్పి.. విజయం సాధించారు. ఇప్పుడు జగన్ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట.
అదే విధంగా వైఎస్ జగన్ ఈ సారి ఎన్నికల ప్రణాళికలో ఒకటి, రెండు తప్ప భారీ పథకాలను చేర్చకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, రైతు రుణ మాఫీని, మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ఆయన ఎన్నికల ప్రణాళికలో చేర్చే అవకాశాలున్నాయి. సామాజిక భద్రత పింఛను సొమ్మును పెంచే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారట. అయితే, ఎన్నికల ప్రణాళికను ప్రకటించే విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి పొత్తుపై తుది నిర్ణయం వెలువడిన తర్వాత ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు.
వైఎస్ జగన్ తిరిగి ఎందుకు రావాలనే విషయంపై ప్రాంతీయ స్థాయిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై వివరించనున్నారు. దాంతో పాటు, జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ పథకాలు కొనసాగుతాయనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరి తండ్రి బాటలో అడుగులు వేస్తున్న జగన్ కి.. విజయం ఖాయం అని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.