Homeఆంధ్రప్రదేశ్‘జెండా’ సభలో జనాలెక్కడ?

‘జెండా’ సభలో జనాలెక్కడ?

తెలుగుదేశం పార్టీ – జనసేన ఉమ్మడిగా నిర్వహించిన మొదటి ఎన్నికల బహిరంగసభ ‘జెండా’ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. రెండు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న బహిరంగసభ కాబట్టి తాడేపల్లిగూడెం దద్దరిల్లిపోతుందనే అనుకున్నారు. ఎందుకంటే టీడీపీ నేతలు ఆ స్థాయిలో బిల్డప్ ఇచ్చారు కాబట్టి. తాడేపల్లిగూడెం బహిరంగసభకు 6 లక్షలమంది జనాలు హాజరవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చాలాసార్లు చెప్పారు. అందుకనే సభ నిర్వహణను 21 ఎకరాల్లో చేస్తున్నట్లు చెప్పారు. తమ్ముళ్ళ మాటలు విన్నతర్వాత చెప్పిందంతా నిజమే అనుకున్నారు. తీరా చూస్తే సభలో జనాలే పెద్దగా కనబడలేదు.

విచిత్రం ఏమిటంటే సభా ప్రాంగణానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ చేరుకున్నప్పటికి జనాలు లేరట. అందుకనే వాళ్ళు ముగ్గురు కారవాన్ వెహికల్లోనే దాదాపు అర్ధగంట వెయిట్ చేయాల్సొచ్చిందట. వీళ్ళ ముగ్గురు వేదిక దగ్గరకు వచ్చేసిన విషయం తెలుసుకున్న తమ్ముళ్ళు అప్పుడు హడావుడిగా జనాలను తరలించారని సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే సభకు వచ్చిన జనాలను కూడా కెమెరాల్లో పెద్దగా చూపలేదు. డ్రోన్ కెమెరాలు ఉన్నప్పటికీ వేదికముందున్న జనాలను మాత్రమే తిప్పి తప్పి పదేపదే క్లోజప్ షాట్లలో చూపించారంతే.

నిజంగానే తమ్ముళ్ళు చెప్పుకున్నట్లు జనాలు బహిరంగసభకు భారీగా హాజరై ఉంటే, గ్రౌండ్ మొత్తాన్ని ఎందుకని చూపించలేదు? సభకు పవన్ హాజరవుతారని తెలిసినా జనాలు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అభిమానులు వచ్చినా గ్రౌండంతా నిండుగా కనిపించేది. అలాంటిది అసలు గ్రౌండ్ మొత్తాన్ని చూపలేదంటేనే అర్థ‌మవుతోంది జనాలు రాలేదని. అయితే తమ్ముళ్ళు మాత్రం 7 లక్షల మంది జనాలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఎల్లో మీడియా మద్దతుంది కాబట్టి సభలకు జనాలు హాజరుకాకపోయినా మసిపూసి మారేడుకాయను చేసినట్లుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు. పెద్ద ఫొటోలేసి బ్యానర్ స్టోరీగా అచ్చేశారు.

కాపులు ఎక్కువగా ఉన్నారు, పవన్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని ఏరికోరి ఎంపిక చేసిన తాడేపల్లిగూడెం బహిరంగసభలోనే చెప్పుకున్నంతగా జనాలు లేరంటే ఇక మిగిలిన సభల మాటేమిటో ఆలోచించుకోవాల్సిందే. పైగా తాడేపల్లిగూడెంలో ముందు జాగ్రత్తగా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందో కూడా బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పటికే వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహిస్తే జనాలు హాజరు గురించి చెప్పుకోవాల్సిన అవసరమేలేదేమో. ఏదేమైనా రెండు పార్టీల మొదటి బహిరంగసభ ఫెయిలైందనే చెప్పాలి. మరి తర్వాత బహిరంగసభ ఎక్కడుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular