Homeఆంధ్రప్రదేశ్కరకట్టకు చేరిన చిత్తూరు అసమ్మతి

కరకట్టకు చేరిన చిత్తూరు అసమ్మతి

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా అసమ్మతి రోజురోజుకు పెరిగిపోతోంది. నాలుగురోజుల క్రితమే 94 మంది అభ్యర్థులతో చంద్రబాబు మొదటి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలోని చాలామంది అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు పెరిగిపోతున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని నగిరి, తంబళ్ళపల్లి, చిత్తూరు నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలు వాదన ఏమిటంటే ఓడిపోయేవారికే చంద్రబాబు ఏరికోరి టికెట్లు కేటాయించారట.

పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారిని కాదని ఏమాత్రం క్యాడర్ లేని, కొత్తవారికి టికెట్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. రెండురోజుల పాటు పై నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేసిన నేతలు డైరెక్టుగా చంద్రబాబుతోనే టికెట్ల పంచాయితీ తేల్చుకుంటామని కరకట్టకు వచ్చేశారు. తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మద్దతుదారులో గోల చేస్తున్నారు. జయచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి బినామీ అంటు ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ‌రెడ్డిని గెలిపించటమే చంద్రబాబు ఉద్దేశ్యమా అని నిలదీస్తున్నారు. అభ్యర్థిని మార్చకపోతే ఓటమి ఖాయమని కూడా చెబుతున్నారు.

నగిరిలో గాలి భానుప్రకాష్ చౌదరికి టికెట్ ఇస్తే రెండోసారి కూడా ఓటమి ఖాయమంటున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే గాలి ముద్దుకృష్ణమనాయుడు భార్య, చిన్నకొడుకు ఒకవర్గం, పెద్ద కొడుకు భాను మరో వర్గం. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు ఓడించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరు ఏమిచేయగలిగేది లేదు. ఇక్కడ భానును మార్చాల్సిందే అని అసమ్మతి నేతలు పట్టుబట్టారు. ఇక చిత్తూరులో గురజాల జగన్మోహన్‌కు టికెట్ ఎలా ఇస్తారంటూ బలిజ సంఘాలు నానా గోల చేస్తున్నాయి.

బెంగుళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి తమపైన రుద్దుతారా అంటు మండిపోతున్నారు. పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న బలిజ నేతల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కష్టపడి పనిచేస్తామని చిత్తూరు అసమ్మతి నేతలు నానా గోల చేస్తున్నారు. పై మూడు నియోజకవర్గాల అసమ్మతి నేతలు చంద్రబాబుతో మాట్లాడేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా కుదరటంలేదు. చంద్రబాబు లేదా లోకేష్ ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. మరి ఈ నియోజకవర్గాల్లోని అసమ్మతి ఎప్పుడు చల్లారుతుందో అభ్యర్థులు ఎప్పుడు ప్రచారంలోకి దిగుతారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular