Homeఆంధ్రప్రదేశ్కుల పాలనా.. పరిపాలనా..

కుల పాలనా.. పరిపాలనా..

ఈ సారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న అతి పెద్ద సవాలు ఇదే. మెజార్టీ ప్రజల బాగోగులుపట్టించుకోకుండా ప్రత్యక్షంగా , పరోక్షంగా, ఉద్దేశ్యపూర్వకంగా, లోపాయికారిగా తన కులం వాళ్లకు మాత్రమే పదవుల్లో, అధికారంలో పెద్దపీట వేస్తూ వారి సుఖం, సంపద, క్షేమమే రాష్ట్ర ప్రజలందరి క్షేమంగా అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ అధినేత భావించడం కుల పాలన. మనది ప్రజాస్వామ్యం కాబట్టి, ఇక తప్పదు అన్నభావంతో కంటితుడుపుగా మాత్రమే ఇతర వర్గాలకు ప్రభుత్వంలో, అధికారంలో నామమాత్ర ప్రాతినిధ్యం కల్పించడం, బలహీనవర్గాల సంక్షేమాన్ని దండుగమారి వ్యవహారంగా భావించడం, ప్రభుత్వ పాలసీల రూపకల్పన అమల్లో ఒక వర్గానికి మాత్రమే లాభం కలిగేలా పక్షపాతం చూపించడం, కీలక వ్యవస్థలను ఒకరిద్దరు వ్యక్తులు తమ అదుపులో పెట్టుకోవడం, చిన్నచిన్న పనులకు కూడా ప్రజలు ఒక కులానికి సంబంధించిన నేతల చుట్టూ తిరగాల్సి రావడం, పాలనా వ్యవస్థలకు ప్రజలకు మధ్య దూరం పెరగడం, సమన్యాయ భావన సోదిలోకి కూడా లేకపోవడం.. ఇవన్నీ కులపాలన లక్షణాలు.

అన్ని వర్గాలనూ ప్రభుత్వంలో, పాలనా వ్యవహారాల్లో కలుపుకుపోవడం, పేదలు కలకాలం పేదలుగా, నిస్సహాయిలుగా మిగిలిపోకుండా వారి ఎదుగుదలకు పాలసీల పరంగా ప్రయత్నించడం, బడుగు బలహీనవర్గాల ప్రజల ఉన్నతి కోసం విద్య, వైద్య రంగంలో మెరుగైన వసతులు కల్పించడం, తలదాచుకునేందుకు గూడు, ఆర్థికంగా నిలబడేందుకు భరోసా కల్పించడం, పాలనా వ్యవస్థలను ప్రజలకు అందుబాటులో ఉండేలా నడిపించడం, ఒక కులం ప్రయోజనాల్లోనే మొత్తం సమాజ ప్రయోజనం ఉందన్న భావనకు చోటివ్వకుండా.. భిన్న మతాలు, అసంఖ్యాక కులాల ప్రజల శ్రేయస్సుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం, పదవుల్లో, అధికారంలోనూ భిన్న కులాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం, పీపుల్స్ ఎంపవ‌ర్‌మెంట్‌ కోసం ప్రయత్నించడం, చిన్న చిన్న అవసరాల కోసం ప్రభుత్వం ఆఫీసులు, ఆఫీసర్లు, లీడర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు అందుబాటులో పాలనా వ్యవస్థలను ఉంచడం,.. ఇదంతా సాధారణ పరిపాలన స్వభావం. సాధారణ పాలనలో గౌరవంగా జీవించే ప్రజలు, కులపాలనలో ఎవడిదో దయకు లోబడి బానిసల్లా బతకాల్సి ఉంటుంది.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత  అయిదేళ్లుగా వైఎస్ఆర్‌సిపి అధికారంలో ఉంది. ఈ పదేళ్లలో మన అనుభవాలను పోల్చి చూసుకోవడం పెద్ద కష్టం కాదు. ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవడానికి అంతకు మించిన ప్రమాణం అక్కరలేదు.
పదేళ్లలో సర్కారు బడుల్లో వసతులు ఎలా ఉన్నాయి.., పిల్లల చదువులు, ఫలితాలు, స్కాలర్ షిప్పులు .. ఎవరి పాల‌న‌లో ప్రోత్సాహం ఎక్కువగా ఉంది…? సర్కారు వైద్య సౌకర్యాలు ఎవరి హయాంలో మెరుగ్గా ఉన్నాయి… బీద కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో మంచంపడితే మంచి వైద్యం, మందుల కోసం అప్పులు చేయాలి, లేదంటే ఉన్న సెంటు, రెండు సెంట్ల స్థలం అమ్ముకోవాలి. అలాంటి పరిస్థితి రాకుండా ఊరూరా ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తూ, ఫ్రీగా మందుల పంపిణీ ఏ ప్రభుత్వం చేపట్టింది ? తలదాచుకోవడానికి సరైన గూడు లేని కొన్ని లక్షల కుటుంబాలకు కాసింత స్థలం, లేదా ఒక చిన్న ఇల్లు సమకూర్చడానికి చర్యలు తీసుకున్న దెవరు? కూలి పనికి వెళ్లినా పనికి దగ్గ ప్రతిఫలం లభిస్తుందో లేదో …. కానీ వృద్ధులు, అవసరార్ధులు, మహిళలు, పెళ్లీడు పిల్లలు, బాలింతలు…ఇలా భిన్న వర్గాలవారికి నెలకు ఎంతో కొంత నగదుతో, సరుకులతో అండగా నిలిచిన ప్రభుత్వం గత పదేళ్లలో ఏది? ఇలా చిన్న చిన్న ప్రశ్నలు వాటి జవాబులే.. ప్రజలు ఎటు వైపు ఏ పార్టీ వైపు ఉండాలో తేలుస్తాయి.

సంక్షేమం మాత్రమే కాదు.. ప్రజలు సాధికారికతను కూడా కోరుకుంటారు. అందువల్ల‌.. రెండు ప్రభుత్వాల్లో భిన్నవర్గాల వారికి పదవుల పంపిణీ ఎలా ఉంది? సొంత కులాలకే ప్రాధాన్యత ఉందా… ఇతరులకు కూడా అవకాశాలు లభిస్తున్నాయా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇతర కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరి హయాంలో ఎక్కువగా ఉన్నారు…ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో కూడా సామాజిక సమతుల్యానికి ఎవరు మొగ్గు చూపుతున్నారు… కులాల బలం మీద ఆధారపడాలని ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే..

సొంత అనుభవాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప దుర్మార్గమైన ప్రచారాలను నమ్మి కాదు. ఒక వర్గం మీడియాలోనూ, వారు పోషిస్తున్న సోషల్ మీడియాలోనూ వచ్చే కట్టుకథలు, అడ్డగోలుఅబద్ధపు ప్రచారాల నమ్మితే, మనకు నీడనిస్తున్న చెట్టును మన చేతుల‌తోనే కూల్చివేసిన‌ట్లే. స్వార్ధ ప్రయోజనాలే లక్ష్యంగా అసత్యాలతో కూడిన విశ్లేషణల మాయలో పడితే… మన మేలుకోరేవారిని కూడా దూరంగా తరిమేసిన‌ట్లే.. మంచిని చెడుగా, మేలును కీడుగా అనుమానించేలా ప్రజల మైండ్‌ను తొలిచివేసే ప్రయత్నాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి…లేదంటే కథ మళ్లీ మొదటికొస్తుంది.

RELATED ARTICLES

Most Popular