ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila)కు ఆదిలోనే భారీ షాక్ తగలనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అలక వహించి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(alla ramakrishna reddy)(ఆర్కే) తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. మంగళగిరి ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో అసంతృప్తికి గురై ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఆయన తిరిగి వైసీపీలోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఎంపీ, తన సోదరుడు అయోధ్యరామిరెడ్డితో కలిసి ఆర్కే ఈ రోజు వైఎస్ జగన్‌ను కలుస్తారని అంటున్నారు. గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంగళగిరిలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్కేను తిరిగి వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు సాగాయని చెప్పుతున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు మంగళగిరి నుంచి ఎమ్యెల్యేగా విజయం సాధించారు. 2014లోనూ 2019లోనూ ఆయన గెలిచారు. 2019లో ఆయన నారా లోకేష్‌ను మట్టి కరిపించారు. ఆర్కే తమ పార్టీకి దూరం కావడం వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.