రానున్న ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల జాబితాలను వరుసగా విడుదల చేస్తున్న వైసీపీ ఇప్పటివరకు 7 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి 8వ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు ఇన్‌చార్జిలను ప్రకటించింది.
వైసీపీ ప్రకటించిన తాజా జాబితాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలకు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ జాబితాను విడుదల చేసినట్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఆ ప్రకటనలో వెల్లడించింది.
తాజా జాబితాలో పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యను గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు ఎంపీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటిస్తూ జాబితా విడుదల చేసింది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కిలారి రోశయ్య స్థానంలో అంబటి మురళికి అవకాశం కల్పించింది. ఇక కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కల్లత్తూర్ కృపాలక్ష్మిలను సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.