రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 24 సీట్లలో మాత్రమే పోటీ చేసేందుకు పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడని మంత్రి రోజా ప్రశ్నించారు. 24 సీట్లకే తోక ఊపుకుంటూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నావా.. అంటూ ఎద్దేవా చేశారు. శనివారం మంత్రి రోజా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన ముష్టి 24 సీట్ల కోసం ఎందుకు తల వంచారో పవన్ చెప్పాలన్నారు.
పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు ముందు పవన్ ఎందుకు తల వంచారో జనసైనికులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు జగనన్నను ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని మంత్రి చెప్పారు.
ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టీడీపీ తరపున చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారని మంత్రి రోజా గుర్తు చేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేసేదీ ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. ఒక స్థానంలో ఓడిపోయిన వారికి మొదటి జాబితాలో, రెండు స్థానాల్లో ఓడిపోయినవారికి రెండో జాబితాలో పేరు ఇస్తారేమోనని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.