చైనాలోని గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భారీ రవాణా నౌక పెరల్ నదిపై నిర్మించిన భారీ వంతెనను ఢీకొట్టింది. దీంతో ఆ వంతెన రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రవాణా నౌక వంతెనను ఢీకొట్టిన సమయంలో బ్రిడ్జిపై ట్రాఫిక్ తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో ఎటువంటి లోడ్ లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు చోటు చేసుకుందని తెలిపారు.
నౌక ఫోష్‌మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే వంతెన రెండు ముక్కలు కాగా, ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన నౌక బ్రిడ్జి మధ్యనే చిక్కుకుపోయింది. వంతెనను ఢీకొట్టిన నౌక కెప్టెన్‌ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.