Homeతెలంగాణగద్దెలపైకి వన దేవతలు.. సమ్మక్క రాకతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం

గద్దెలపైకి వన దేవతలు.. సమ్మక్క రాకతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం

డప్పు చప్పుళ్లు, కోయల నృత్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు.. జై సమ్మక్క అంటూ చేసే నినాదాల నడుమ భక్తి ప్రపత్తులతో వడ్డెలు (పూజారులు) సమ్మక్క తల్లిని చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి భారీ బందోబస్తు మధ్య గురువారం రాత్రి తోడ్కొని వచ్చారు. ఎర్రగుడ్డతో ముఖమంతా కప్పుకున్న వడ్డెల బృందం ఒక్కో అడుగువేస్తూ ముందుకు సాగింది. ఈ సమయంలో జనారణ్యమంతా భక్తితో పులకరించిపోయింది. వనదేవతకు ఎదురేగి మొక్కులు సమర్పించుకునేందుకు పోటీపడ్డారు. రెండేళ్ల నుండి ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి.

ఆధిపత్యానికి ఎదురుతిరిగిన ధీరత్వం కుంకుమ భరణి రూపంలో జనం కళ్ళ ముందు నిలిచింది. చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని తీసుకొచ్చే అపూర్వ ఘట్టం తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన పూజారులు సిద్దబోయిన మునేందర్, కొక్కరి కృష్ణయ్య, చంద బాబురావు, సిద్దబోయిన మహేష్, సిద్దబోయిన లక్ష్మణ్ రావు ముందుగా చిలుకలగుట్టపై ఉన్న నెమిలినార చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమ భరణితో గుట్టపై నుంచి కిందికి దిగగానే మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ స్వాగతం పలికారు.

తల్లి ఆగమనాన్ని సూచిస్తూ జిల్లా ఎస్పీ ఏకే 47 గన్‌తో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సమ్మక్క తల్లి రాకతో వన దేవతలంతా గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం మొత్తం తన్మయత్వంతో ఊగిపోతోంది. చిలకలగుట్ట నుండి తల్లి గద్దెల వరకు దారి పొడువునా మేకలు కోళ్లు అమ్మవారికి బలి ఇస్తూ మొక్కులు భక్తులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు తల్లి నామస్మరణతో మేడారం మారుమోగుతోంది. అపూర్వ ఘట్టం చూసేందుకు ఇంకా వేలాదిమంది భక్తులు తరలి వస్తూనే ఉన్నారు.

జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం

మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. బుధవారం సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి చేరుకుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయం నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని వడ్డెలు శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేశారు. తర్వాత పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలిపారు. ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరించారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి వెళ్లి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు.

గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లి అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరణి, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజాతంతు అంతా గోప్యంగా జరిపి ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇచ్చారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీని పేల్చారు.

గుట్టపై నుంచి సమ్మక్క కిందకు ఏతెంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆట పాటలతో అలరించారు. పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగి అత్యంత వేగంగా మేడారం గద్దెవైపు కదలగా దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చుండి మంగళహారతులు పట్టారు. కోళ్లు, గొర్రెలను బలిచ్చి మొక్కులు సమర్పించారు. రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకొచ్చారు. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర పతాకస్థాయికి చేరుకున్నది.

రాత్రి పూజలందుకున్న సారలమ్మ సారాలమ్మ

మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది. పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెల పైకి చేరుకున్నారు. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 12.11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. అంతకుముందు పగిడిద్దరాజు-సమ్మక్క కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మక్క రాకతో జాతరలోని కీలక ఘట్టం పూర్తయింది. జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాదిమంది భక్తజనంతో మేడారం జనారణ్యంగా మారిపోయింది. శుక్రవారం వనదేవతలను భక్తులు సందర్శించుకోనున్నారు.

జాతీయ పండుగ హోదా దేశంలో ఏ పండుగకూ లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. గురువారం కిషన్ రెడ్డి మేడారం సందర్శించి తల్లులకు మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయపండుగ అనే అంశం దేశంలోనే ఎక్కడా లేదని, అలాంటి గుర్తింపు ఎక్కడా ఇవ్వలేదని చెప్పారు. మేడారంను జాతీయపండుగగా గుర్తించడం అనేది అందుకే ఆగిపోతున్నదని తెలిపారు. అయినా మరోసారి ఆలోచిస్తామని చెప్పారు. గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు శుక్రవారం వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృతస్థాయిలో ఏర్పాటు చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular