నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులకు సంబంధించి ఏపీ అభ్యంతరాల నేపధ్యంలో పనుల పర్యవేక్షణ, పరిశీలన నిమిత్తం కేఆర్‌ఎంబీ సభ్యులైన సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి అధికారుల బృందం గురువారం నాగార్జున సాగర్ చేరుకుంది. సాగర్ డ్యాం మరమ్మతు పనులను పరిశీలించింది. రెండు రోజుల పాటు బృందం ఇక్కడే ఉండనుంది.
ఏపీ వైపు కుడి కాలువకు సంబంధించిన ఒక గేటు గతంలో కొట్టుకుపోగా దాంతో పాటు 8 గేట్లను తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మరమ్మతులు చేపట్టింది. ఆ గేట్ పైన బీటీ రోడ్ల మరమ్మతులు, ఇతర పనులను చేయాల్సి ఉంది. ఇక గేట్లు ఉండే క్రేన్‌లకు సంబంధించిన పట్టాల పనులు కూడా కొనసాగించాల్సివుంది. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే మరమ్మతులు పూర్తి చేయాల్సివుంది. అయితే ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదంతో పనుల్లో జాప్యం నెలకొంది.
ఇటీవల మరమ్మతులు చేపట్టగా తమ పరిధిలోని డ్యాంపై తెలంగాణ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడంపై ఏపీ అభ్యంతరం తెలుపుతూ ఈనెల 16వ తేదీన కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. నిజానికి 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం డ్యామ్ నిర్వహణ బాధ్యలను ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ భాద్యతలను తెలంగాణ నిర్వహిస్తుంది.
అందులో భాగంగానే ఏటా కొనసాగించే తీరులోనే వర్షాకాలానికి ముందే సాగర్ డ్యాం మరమ్మతులు పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులు జరుగుతుండగానే సీఆర్‌పీఎఫ్ తొలుత అడ్డుపడగా, ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖలతో అడ్డుపడింది. చివరకు కృష్ణా బోర్డు మరమ్మతు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం పనులను కొనసాగిస్తుంది.
మరమ్మతు పనులు…భద్రతలను పరిశీలించిన బోర్డు సభ్యులు
సాగర్ డ్యాం మరమ్మతు పనులు సాగుతున్న తీరుతెన్నులను గురువారం కేఆర్‌ఎంబీ బృందం పరిశీలించింది. సాగర్ ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్రం, రేడియల్ క్రస్ట్ గేట్లను, గ్యాలరీలను, టెలీమెట్లతో పాటు స్పిల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో తదితర విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం భద్రత అంశాలను సమీక్షించారు. గురువారం రాత్రి సాగర్ హిల్ కాలనీలోని అతిథిగృహంలో బసచేసి శుక్రవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును మరోసారి సందర్శించి మరమ్మతు పనులను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నీటీ పారుదల శాఖ ఎస్‌ఈ నాగేశ్వర్ రావు, ఈఈ మల్లిఖార్జున్, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆర్‌పీఎఫ్, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.