Homeతెలంగాణతెలంగాణలో అధికారులపై ఏసీబీ కన్ను?

తెలంగాణలో అధికారులపై ఏసీబీ కన్ను?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సంఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. రూ.కోట్లు కొల్లగొట్టిన ఆయన బినామీలపైనా ప్రభుత్వం కన్నేసింది. శివబాలకృష్ణ ఓ ఐఏఎస్ అధికారికి రూ.10 కోట్లు చెల్లించాడంటేనే ఆయన దోపిడీ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈయన ఆస్తుల విలువ రూ.150 కోట్లు అని చెబుతున్నారు. కానీ, 500 కోట్ల వరకు ఉండొచ్చని భావన. ఇలాంటివారి లెక్క తేల్చాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చూస్తోంది. అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తోంది.


ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొన్నేళ్లుగా పాతుకుపోయి, అడ్డగోలుగా ఆర్జించిన వారి వివరాలు తెలుసుకుంటోంది. నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. ఒక్కరు కాదు వందలు.. శివబాలకృష్ణ లాంటి అధికారులు వందల్లో ఉంటారని తెలంగాణ ఏసీబీ భావిస్తోంది. కొన్ని శాఖల్లో అధికారులపై కొంతకాలంగా పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో రెవెన్యూ, పోలీసు, ఆబ్కారీ, పురపాలక, హెచ్ఎండీఏ, రెరా ముఖ్యమైనవి. భూముల ధరలు భారీగా పెరగడం, స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉండడంతో టౌన్ ప్లానింగ్ వంటి శాఖల అధికారులు భారీగా ఆర్జించారని ఇసుక తవ్వకాల్లోనూ ముడుపులు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ఏసీబీ ఇప్పటివరకు ట్రాప్ కేసులకు పరిమితమైంది.
ఎవరైనా ఆరోపణలు చేస్తేనే..

అవినీతి అధికారులను పట్టుకోవడం అన్నమాట. ఇకమీదట మాత్రం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అధికారిని గుర్తించడం, ఎలా సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, బినామీలు, బంధువులు, స్నేహితుల ఇళ్లు వంటి అవినీతి అధికారుల చిట్టాతో నేరుగా డాడి చేయాలని చూస్తోంది. పక్కా ఆధారాలతో ముందుకెళ్లాలని చూస్తోంది. అయితే, నెల రోజుల కసరత్తుతో దీనిని చేపట్టనుంది. దీనికి పదుల సంఖ్యలో సిబ్బంది రహస్యంగా పనిచేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అరికట్టాలంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పెరగాలి. అప్పుడే అడ్డగోలుగా సంపాదిస్తే పట్టుబడతామనే భయం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా ఏసీబీ కేసులపైనా దృష్టి సారించింది. ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా అక్రమార్కుల వివరాలను సేకరించనున్నారు.

RELATED ARTICLES

Most Popular