చాలా మంది ఉదయం లేవగానే వాకింగ్‌కు వెళ్తుంటారు. కొందరు ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తుంటారు. ఆ తర్వాత హెల్తీ డ్రింక్స్ లేదా హెల్తీ ఫుడ్స్‌ను తీసుకుంటుంటారు. అలాంటి హెల్తీ డ్రింక్స్‌లో ఒకటి అలోవేరా జ్యూస్. ఈ జ్యూస్ ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. బరువు తగ్గొచ్చు. గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అతేకాదు కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది. అయితే ఈ మొక్కను ఇంటి వద్ద కూడా పెంచుకోవచ్చు. అలా తక్కువ ఖర్చులో అలోవేరా జ్యూస్‌ను పొందొచ్చు.
అలోవేరా పోషకాల గని
అలోవేరా జ్యూస్‌లో విటమిన్లు బీ, సీ, ఈ, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కాల్షియం, క్రోమియం, సోడియం, మెగ్నీషీయం, కాపర్, మాంగనీస్, జింక్, పొటాషియం కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ బీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఈ రకరకాల క్యాన్సర్ కారకాల నుంచి కాపాడుతుంది. ఫోలిక్ యాసిడ్ గుండె జబ్బులను అరికడుతాయి.
కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది..
అలోవేరా జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో జీవక్రియను మెరుగుపరుస్తాయి. మెరుగైన జీవక్రియ కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. అంతేకాకుండా అలోవేరాలోని విటమిన్ బీ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఆకలిని కూడా అరికడుతుంది. తద్వారా మీరు సరైన బరువును కూడా పొందే అవకాశం ఉంటుంది.
మలినాలను బయటకు పంపేస్తుంది..
అలోవేరా జ్యూస్‌లో ఖనిజాలు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తాయి. మార్నింగ్ వర్కువుట్స్ పూర్తయిన తర్వాత అలోవేరా జ్యూస్ తీసుకుంటే, కోల్పోయిన పోషకాలు శరీరానికి తిరిగి అందుతాయి.
కాలేయం పనితీరు మెరుగు..
కాలేయం దెబ్బతింటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. మలబద్దకానికి కూడా దారి తీస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి, దుర్వాసన వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. కలబంద రసంలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తగిన హైడ్రేషన్, పోషణను అందిస్తుంది. తద్వార కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.