HomeజాతీయంLok Sabha Elections | ఇంకుపడుద్ది..! లోక్‌సభ ఎన్నికలకు మైసూర్‌ కంపెనీకి భారీగా ఆర్డర్‌ ఇచ్చిన...

Lok Sabha Elections | ఇంకుపడుద్ది..! లోక్‌సభ ఎన్నికలకు మైసూర్‌ కంపెనీకి భారీగా ఆర్డర్‌ ఇచ్చిన ఈసీ..!

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నది. ఎన్నికల్లో ఓటువేసిన ఓటర్లకు వేలికి ఇండెలబుల్‌ ఇంక్‌ వేయనున్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల కోసం 26.50లక్షల ఇంక్‌ బాటిల్స్‌కు మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. ఎన్నికలకు వినియోగించే ఇంక్‌ను దేశంలో ఈ ఒక్కటే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మార్చి 20లోగా అన్ని రాష్ట్రాలకు ఈ ఇంక్‌ను కంపెనీ సరఫరా చేయబోతున్నది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్ట్‌ కే మహ్మద్‌ ఇర్ఫాన్‌ మాట్లాడుతూ 26.5లక్షలకుపైగా ఇంక్‌ వయల్స్‌ సరఫరా చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినట్లు తెలిపారు. ఓటు వేసిన తర్వాత ఎడమ చేతి వేలుపు ముదురు ఊదారంగును వేసే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. ఢిల్లీకి చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఫిజికల్‌ లాబొరేటరి అభివృద్ధి చేసిన ఈ ఇంక్‌ను 1962 నుంచి మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేస్తూ వస్తున్నది.

2.65లక్షల లీటర్లు సరఫరా..

2.65లక్షల లీటర్ల ఇంక్‌ సరఫరా కోసం ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని.. ఇప్పటికే 1.59లక్షల లీటర్లు 24 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఇర్ఫాన్‌ తెలిపారు. ఇప్పటి వరకు గాజు సీసాలు ఉండేవని.. ఈ సారి ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఇంక్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వయల్‌లో 10 మిల్లీలీటర్ల ఇంక్‌ ఉంటుందని.. దాంతో 700 మంది ఓటర్ల వేలికి సిరా వేయచ్చని తెలిపారు. సాధారణంగా ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉంటారు. ఈ సారి ఎన్నికల కోసం 12లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం దేశంలో 97కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 లోక్‌సబ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య దాదాపు 90కోట్లు. 2019లో ఎన్నిల కమిషన్‌ 26లక్షల ఇంక్‌ వయల్స్‌ని ఆర్డర్‌ చేసింది.

ఎన్నికల సిరా చరిత్ర..

ఓటు వేసిన తర్వాత ఓటర్ల చేతికి వేసే ఇండెలబుల్‌ ఇంక్‌ వెనుక పెద్ద చర్రిత ఉన్నది. తొలిసారిగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నది. ఓటువేసిన వారు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండడం వారిని ఎలా గుర్తించాలో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలోనే ఓటు వేసిన వేలికి సిరా గుర్తును వేయాలని.. అది కొద్దిరోజుల వరకు చెరిగిపోకుండా ఉండాలనే ఆలోచన చేసింది. అందులో భాగంగానే ‘బ్లూ ఇంక్‌’ పద్ధతిని తీసుకువచ్చింది. 1962లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిసారిగా బ్లూ ఇంక్‌ని వాడడం ప్రారంభించారు. ఆర్‌అండ్‌డీ ఆర్గనైజేషన్‌ ఈ ఇంక్‌ని తయారు చేసింది. ఆ తర్వాత దీన్ని మైసూర్‌ పెయింట్‌ అండ్‌ వార్నిస్‌ లిమిటెడ్‌కి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ కంపెనీయే ఎన్నికల కోసం ఇంక్‌ను ఉత్పత్తి చేస్తున్నది.

భారత్‌తో పాటు 25 దేశాల్లో..

ఈ ఇంక్‌ను భారత్‌లో జరిగే ఎన్నికలతో పాటు కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేషియా, నేపాల్‌, దక్షిణాఫ్రికా, మాల్దీవులు సహా 25 కంటే ఎక్కువ దేశాలకు మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిలెడ్‌ ఎగుమతి చేస్తున్నది. అయితే, కంపెనీ ఇంకుతో సులువుగా ఉపయోగించేలా మార్కర్‌ పెన్నులను సైతం తయారు చేస్తున్నది. అయితే, ఇతరదేశాల్లో వాటిని వినియోగిస్తున్నా భారత్‌లో మాత్రం ఇంకా సిరాను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ ఇంక్‌ వేలిపై వేసిన కొద్ది వారాలు, నెలల పాటు ఉంటున్నది. ఎన్నికల సమయంలో ఇంక్‌ని సరఫరా చేసే ముందు పలుసార్లు పరీక్షిస్తారు. ఇండెలబుల్‌ ఇంక్‌లో సుమారు 15 నుంచి 18శాతం వరకు సిల్వర్‌ నైట్రేట్‌తో పాటు పలు రసయనాలను కలుపుతుంటారు. రసాయన ఫార్ములాను నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా వినియోగిస్తుండగా.. ఇందులో ఏం రసాయనాలను కలుపుతారన్నది మాత్రం బయటకి తెలియదు. ఎంతో సీక్రెట్‌గా తయారు చేసిన ఈ ఇంక్‌ కొద్దిరోజుల వరకు ఈ సిరా గుర్తు చెరిగిపోకుండా ఉంటుంది. దొంగ ఓట్లు పోల్‌ కాకుండా ఉండేందుకు ఎన్నికల్లో ఓటు వేసే వారి చూపుడు వేలికి ఇంక్‌ వేస్తారు. అయితే, చూపుడు వేలికి గాయమైతే మరో వేలికి ఇంక్‌ వేస్తారు.

RELATED ARTICLES

Most Popular