GSLV-F14 | చంద్రయాన్-3, ఆదిత్య మిషన్‌తో పాటు పీఎస్‌ఎల్‌వీ సీ-38 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి జోరుమీదున్న ఇస్రో మరో ప్రయోగం చేపట్టేందుకు రెడీ అయ్యింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్‌ను శనివారం నింగిలోకి పంపనున్నది. శ్రీహరికోటలో ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభించింది. సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ రాకెట్ ఇన్‌శాట్ 3డీఎస్ శాటిలైట్‌ను ఇస్రోశాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ప్రయోగం కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.5గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో ప్రారంభించింది.
ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. ఇన్‌శాట్ 3డీఎస్ శాటిలైట్‌ను ఇస్రో భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. వాతావరణం, భూమి, సముద్ర ఉపరితలాలు, మెరుగైన వాతావరణ పరిశీలన, విపత్తు హెచ్చరికలు జారీ చేసేందుకు, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహం ప్రస్తుతం పని చేస్తున్న ఇన్‌శాట్ 3డీ, ఇన్‌శాట్ 3డీఆర్ ఇన్ ఆర్బిట్ శాటిలైట్స్ స్థానంలో సేవలందించనున్నది.
ఇదిలా ఉండగా.. జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం కాగా.. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో ఈ రాకెట్‌ను రూపొందించడం విశేషం. తేలికపాటి ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో పీఎస్‌ఎల్వీ రాకెట్లను వినియోగిస్తుండగా.. భారీ బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపే సమయంలో బాహుబలి రాకెట్లుగా పేరుగాంచిన జీఎస్‌ఎల్వీ రాకెట్లను వినియోగిస్తూ వస్తుంటుంది. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఎదురైనా.. వాటిని అధిగమించి ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపంచుకుంటూ జీఎస్ఎల్వీ రాకెట్‌ను సిద్ధం చేస్తూ వస్తున్నది.